కరోనా: తిరుగుతున్నారు..!  | No Monitoring Coronavirus Home Isolation Patients In Hyderabad | Sakshi
Sakshi News home page

కరోనా: తిరుగుతున్నారు..! 

Published Mon, Jul 6 2020 6:51 AM | Last Updated on Mon, Jul 6 2020 6:57 AM

No Monitoring Coronavirus Home Isolation Patients In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డులన్నీ దాదాపుగా రోగులతో నిండిపోయాయి. కొత్తగా కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన వారికి ఆయా ఆస్పత్రుల్లో పడకలు దొరకని దుస్థితి. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేస్తున్నారు. ఏ లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ నిర్ధారణై ఇంట్లో ప్రత్యేక గది ఉన్న కోవిడ్‌ బాధితులకు హోం ఐసోలేషన్‌ సిఫార్సు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 10,487 యాక్టివ్‌ కేసులు ఉండగా, వీటిలో 60 శాతం అంటే 6,556 కేసులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నాయి. వీటిలో 90 శాతం కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల నిష్పత్తికి మించి రోగులు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పర్యవేక్షణ బాధ్యతను క్షేత్రస్థాయి వైద్యులకు అప్పగించింది.(10 వేల పడకల కోవిడ్‌ సెంటర్‌)

వీరు బాధితుల ఇంటికి వెళ్లి.. ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు హోం ఐసోలేషన్‌ సదుపాయం ఉందో..లేదో  పరిశీలించాలి. సంతృప్తి చెందిన తర్వాత వారికి అవసరమైన మాస్కులతో పాటు శానిటైజర్, మల్టీవిటమిన్‌ టాబ్లెట్‌ కిట్‌లను అందజేయాలి. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధితులే స్వయంగా మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు, మార్కెట్లకు వెళ్లి కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యవసరాలు కొనుగోలు చేస్తున్నారు. వారి చేతికి స్టాంపు లేకపోవడం, వైరస్‌ ఉన్నట్లు కూడా ఇతరులకు తెలియక పోవడంతో వారి నుంచి ఇతరులకు వైరస్‌ విస్తరిస్తోంది. ఇటీవల కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.  (మిలియన్‌ మార్క్)

నిలిచిన ట్రేసింగ్‌.. 
గ్రేటర్‌లో మార్చి నుంచి మే చివరి నాటికి 1,616 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. జూన్‌లో 11, 080 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జులైలో కేవలం నాలుగు రోజుల్లోనే 5,109 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 60 శాతానికిపైగా కేసులు హోం ఐసోలేషన్‌లో ఉన్నాయి. మిగిలిన కేసులు  కేసులు గాంధీ, కింగ్‌కోఠి, చెస్ట్, నేచర్‌క్యూర్, యునానీ సహా పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్నాయి. నిజానికి మొదట్లో కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు ఎవరైనా 104కు ఫోన్‌ చేస్తే చాలు వెంటనే వైద్యులు సహా పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రత్యేక వాహనంలో ఇంటిముందు వాలిపోయేవారు. లక్షణాలు ఉన్న వారిని స్వయంగా అంబులెన్స్‌లో తీసుకెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించేవారు. బాధితులకు సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్‌ చేసి, ఆ బస్తీలోకి రాకపోకలను పూర్తిగా నిలిపివేసేవారు.

వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్‌ చల్లేవారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెగుతుండటంతో కంటైన్మెంట్‌ జోన్ల పరిధిని కూడా కుదిస్తూ రావడంతో పాటు సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారిని కూడా పూర్తిగా నిలిపివేశారు.. ఆ తర్వాత పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటిని మాత్రమే కంటైన్‌మెంట్‌ చేసి, నోటీసు బోర్డు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం గ్రేటర్‌లో రోజుకు సగటున 1500 నుంచి 1650 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్యులు, పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు కూడా వైరస్‌ బారిన పడుతుండటం, ఒకే ఏరియాలో రోజూ వందకుపైగా కేసులు నమోదవుతుండటంతో ట్రేసింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాం. మాకు టెస్టులు చేయండి! అని వేడుకున్నా.. స్పందించే వారు లేరు.  

స్పందించని 108  
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 108 వాహనాలు 60 ఉన్నాయి. తొలుత వీటిలో 40 వాహనాలను కేవలం కోవిడ్‌ పేషంట్ల తరలింపు కోసమే కేటాయించారు. ఒక్కో వాహనం రోజుకు సగటున ఆరు నుంచి ఏడు కేసులను మాత్రమే తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం వాహనాల నిష్పత్తికి మించి పాజిటివ్‌ కేసులు నమోదువుతుండటంతో రోగుల తరలింపు విషయంలో ఇవి కూడా చేతులెత్తేశాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. దీంతో బాధితులే స్వయంగా సొంత వాహనాల్లో టెస్టింగ్‌ సెంటర్లకు చేరుకుని, శాంపిల్స్‌ ఇచ్చి వెళ్తున్నారు. మూడు రోజులైనా రిపోర్టులు రాకపోవడంతో నమూనాలు ఇచ్చిన వారు కూడా సాధారణ సిటిజనుల్లా బయట తిరుగుతున్నారు. వీరిలో చాలా మందికి వైరస్‌ ఉండటం, అది వారికి కూడా తెలియక పోవడంతో వారి నుంచి ఇతరులకు వైరస్‌ విస్తరిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement