రైల్వే కోర్టు ప్రాంగణంలో టీఆర్‌ఎస్ నాయకులు, న్యాయవాదులతో మంత్రి ఈటల రాజేందర్
కాజీపేట రూరల్: తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసుల్లో భాగంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు మరో ఐదుగురు గురువారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. రైల్వే కోర్టు పోలీసులు, టీఆర్‌ఎస్ నాయకులు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
2011లో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో వంటావార్పు చేసినందుకు మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు టీఆర్‌ఎస్ నాయకులు మాట్ల రమేష్, నవీన్‌కుమార్, బాలసాని కుమారస్వామి, కొలిపాక రాములు, పాక కుమారస్వామిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో వారు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కేసులను పరిశీలించిన మెజిస్ట్రేట్ రూ.800 చొప్పున ఆరుగురికి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పి, కేసు కొట్టివేసినట్లు వారు తెలిపారు.
కేసులను కొట్టివేయాలి : ఈటల
కోర్టు ప్రాంగణంలో ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అక్రమంగా నమోదు చేసిన కేసులను కేంద్రం వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు. తనపై ఇంకా రెండు కేసులు ఉన్నాయని తెలిపారు.
రైల్వే కేసులతో తెలంగాణవాదులు ఐదు ఏళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై పెట్టిన కేసులు కూడా చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. రైల్వే కేసులను ఎత్తివేయాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment