మౌనమేలనోయి.. | No rigistrations for some private hospitals | Sakshi
Sakshi News home page

మౌనమేలనోయి..

Published Tue, Sep 29 2015 4:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

మౌనమేలనోయి.. - Sakshi

మౌనమేలనోయి..

వైద్యం వ్యాపారంగా మారింది. ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అర్హత లేని వైద్యులూ నాడీ పడుతున్నారు. రిజిస్ట్రేషన్ లేకున్నా ఆస్పత్రుల నిర్వహణ కొనసాగుతోంది. వెరసి వైద్యం మరింత ఖరీదవుతోంది. ఇదంతా తెలిసినా వైద్యారోగ్యశాఖ ‘మామూలు’గానే వ్యవహరిస్తోంది.
సాక్షి, మంచిర్యాల :
జిల్లాలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల మాటున ప్రమాదం పొంచి ఉంది. చికిత్స కోసం ఆయా ఆస్పత్రులకు వెళ్లే రోగుల ప్రాణాలకు భరోసా లేదు. వాటిలో పని చేసే సిబ్బందికి కనీసం వైద్య సేవలందించే అర్హతే లేదు. ఆస్పత్రుల్లో, బయట ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాలదీ అదే పరిస్థితి. ఎలాంటి అనుభవం లేకున్నా పరీక్షలు నిర్వహిస్తున్న టెక్నీషియన్లు వందలాది మంది ఉన్నారు. ఇలాంటి వ్యాధి నిర్ధారణ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 600కు పైగా ఉంటే.. ప్రైవేటు ఆస్పత్రులు 200 వరకు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌తోపాటు నిర్మల్, ఆసిఫాబాద్, భైంసా, కాగజ్‌నగర్, బెల్లంపల్లి వంటి పట్టణాల్లోనే ఎక్కువ ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి.

ఒక్క మంచిర్యాల పట్టణ పరిధిలోనే 25 ఆస్పత్రులు.. క్లినిక్ నిర్వాహకులు ఏళ్ల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే నిర్వహిస్తున్నారు. పట్టణంలో 96 వ్యాధి నిర్ధారణ కేం ద్రాలుండగా.. ఏడింటికే అనుమతి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాటిలో కొన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ కళ్లుగప్పి.. రిజిస్ట్రేషన్ లేకుండానే కొనసాగుతుంటే.. ఇంకొన్ని నిబంధనలకు విరుద్ధం గా కొనసాగుతున్నాయి. లేనిరోగాలు అంటగట్టి.. ఆపై ఆ వ్యాధులకు చికిత్స చేసి రోగులను నిలువున దోచుకుంటున్న ఆస్పత్రులు.. వ్యాధి నిర్ధారణ కేంద్రాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
జేబులు గుల్ల అని తెలిసినా..!
ప్రైవేట్ ఆస్పత్రులు.. వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఆశ్రయిస్తే జేబులు గుల్లవుతాయని జిల్లా ప్రజలకు తెలు సు. అయినా.. ప్రాణానికి ముప్పొస్తే.. అప్పు చేసైనా బతకాలనే ఆశ వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లేలా చేస్తోంది. కళ్లు చెదిరిపోయే వసతులు.. హంగులు చూసి అక్కడే మెరుగైన వైద్యం అందుతుందని భావిం చి ఆస్పత్రుల ముందు రోగులు ‘క్యూ’ కడుతున్నారు. అందుకే ప్రైవేట్ ఆస్పత్రులు నిత్యం రోగులతో కిటకిటలాడుతున్నాయి. అనుభవజ్ఞులమని చెప్పుకుంటూ అక్కడి డాక్టర్లు రోగులను పరీక్షిస్తున్నారు. మందులు రాస్తున్నారు. అవసరమైనవే కావు.. అనవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలూ రాసి దోచుకుంటున్న వైద్యులు ఎంతోఉంది ఉన్నారు.
 
అనుమతి లేకున్నా.. యథేచ్ఛగా..!
ప్రైవేట్ ఆస్పత్రులు.. నర్సింగ్‌హోం.. క్లినిక్.. పాలిక్లినిక్‌లు కలిపి జిల్లా వ్యాప్తంగా 900కు పైనే ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ కేంద్రాలు రెండు వేలకు పైనే ఉన్నా యి. వీటిని నిర్వహించాలంటే.. ముందుగా వైద్యారోగ్యశాఖ అనుమతి తీసుకుని.. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అందులో పని చేసే సిబ్బంది విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు.. ఆయా ఆస్పత్రుల్లో అందించనున్న సేవలు.. అందుబాటులో ఉన్న వైద్య సంబంధిత పరికరాల వివరాలు డీఎంహెచ్‌వో కార్యాలయంలో సమర్పించి అనుమతి వచ్చిన తర్వాతే ప్రారంభించాలి.

కానీ జిల్లాలో పలువురు ఆస్పత్రి.. వ్యాధి నిర్ధారణ కేంద్రాల నిర్వాహకులు వైద్య సంస్థలు ప్రారంభించిన కొన్నేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే.. కొందరు రిజిస్ట్రేషన్ విషయాన్నే మామూలుగా తీసుకుంటున్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఏదైనా ప్రమాదం జరిగితేనే తప్ప వైద్యశాఖ స్పందించడం లేదు. అప్పటి వరకు తామేమీ చేయలేమని వైద్యాధికారులే చెప్పడం గమనార్హం. ‘అనుమతి లేని ఆస్పత్రులు.. వ్యాధి నిర్ధారణ కేంద్రాలను సీజ్ చేస్తే నిర్వాహకులు కోర్టుకెళ్తారు.. అప్పుడు వారితోపాటు తామూ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పటికే మాకు బోలేడు పనులున్నాయి. కోర్టు చుట్టూ తిరిగితే మిగతా పనులకు జాప్యం జరుగుతుంది’ అని మంచిర్యాలకు చెందిన ఓ సీనియర్ వైద్యాధికారి వివరణ ఇచ్చారు.
 
కఠినంగా వ్యవహరిస్తాం
జిల్లాలో వైద్యారోగ్యశాఖ రిజిస్ట్రేషన్ లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. వ్యాధి నిర్ధారణ కేంద్రాల విషయంలో కఠినంగా వ్యహరిస్తాం. అర్హత లేకున్నా వైద్యం.. పరీక్షలు నిర్వహించడం నేరం. త్వరలోనే స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వైద్య సంస్థలను సీజ్ చేస్తాం. ప్రజలూ ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెట్టుకుని వాటిలోనే చికిత్స తీసుకోవాలి.
- జలపత్‌నాయక్, డీఎంహెచ్‌వో

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement