
ఎక్కడా ఉల్లంఘన లేదు
శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ ఎక్కడా ఉత్తర్వులను ఉల్లంఘించలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ ఎక్కడా ఉత్తర్వులను ఉల్లంఘించలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004లో జారీ అయిన జీవో 107కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు పోరాటం చేయడంతో... దానికి సవరణగా 2005లో జీవో 233ను తీసుకువచ్చారని ఆయన చెప్పారు. ఈ జీవో 233 ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీకి అనుమతి మేరకు నీటిని విడుదల చేసిన తరువాత 834 అడుగుల నీటి మట్టం వరకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుందని తెలిపారు. దీనిపై టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆదివారం హరీశ్‌రావు సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలంలో నీటి వినియోగానికి సంబంధించి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జారీ చేసిన జీవో 69, రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జారీ చేసిన 107, 233 జీవోలను కూడా టీడీపీ నేతలకు పంపిస్తామన్నారు. వాటిని వారు అర్థం చేసుకోలేకపోతే ఇంగ్లీషు టీచర్‌ను కూడా పంపిస్తామని, చదువుకుని అర్థం చేసుకోవాలని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు, ఏపీ మంత్రులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని.. కాకి లెక్కలు చెబుతూ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంకా నికర, మిగులు జలాల నుంచి 136 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు ఉందని చెప్పారు. సీమాంధ్ర నేతలు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలపై పెత్తనం కోసం ఒకరికొకరు ప్రయత్నించారని.. తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని హ రీశ్ విమర్శించారు.
బాబుది మొసలి కన్నీరు..
జీవో 107ను రద్దు చేయాలని డిమాండ్ చేసి సవరణ జీవో వచ్చేలా చేసిన చంద్రబాబు, దేవినేని ఉమ తదితరులు.. ఇప్పుడు అదే జీవో 107 ప్రకారం నీటిమట్టం ఉండాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని హరీశ్ పేర్కొన్నారు. రాయలసీమకు అన్యాయం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో 107 తేవడంపై అఖిలపక్షం నిర్వహిస్తే.. జీవోకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఆ సమావేశాన్ని బహిష్కరించినట్లు హరీశ్ చెప్పారు. తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ ద్వారా కేవలం 34 టీఎంసీల నీరు మాత్రమే తీసుకుని వెళ్లాలని.. కానీ ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా తరలించారని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా చట్టాలను, జీవోలను ఎవరు ఉల్లంఘించారో స్పష్టమవుతోందన్నారు. తమకు ఒక్క చుక్క నీరు, ఒక్క యూనిట్ కూడా అక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం లేదని హరీశ్ చెప్పారు. కృష్ణపట్నం, సీలేరు ప్రాజెక్టుల నుంచి వెయ్యి మెగావాట్లు తెలంగాణకు రావాల్సి ఉండగా.. ఒక్క యూనిట్ విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. పైగా శ్రీశైలంలో తెలంగాణ ఉత్పత్తి చేస్తున్న 800 మెగావాట్ల ఉత్పత్తిని ఆపేస్తే.. 300 మెగావాట్లు ఇస్తామని చంద్రబాబు, ఎర్రబెల్లి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 800 మెగావాట్ల విద్యుత్‌ను వదులుకుని 300 మెగావాట్ల విద్యుత్ కోసం వెళ్లాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నీటిని ప్రాజెక్టులు లేక తాము వినియోగించుకోలేకపోతున్నామని, అందుకే విద్యుత్ ఉత్పత్తి చేసి.. రైతులకు అందిస్తున్నామని హరీశ్ చెప్పారు.