సాక్షి, వరంగల్: అభ్యర్థుల నామినేషన్ల ముహూర్తం ఖరారైంది. వేద శాస్త్రాల ప్రకారం నేడు తిథి నక్షత్రాలు బాగున్నాయని వేద పండితులు తేల్చిచెప్పటంతో అధికార, ప్రతిపక్ష అభ్యర్థులతో పాటు స్వతంత్రులు మెజార్టీ నామినేషన్లు సమర్పించటానికి సిద్ధమయ్యారు. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 20 మంది నామినేషన్లు వేయనున్నారు. జన సమీకరణ కుదరకపోతే ముందు ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించి, తరువాత రోజుల్లో భారీ ఊరేగింపులో వెళ్లి రెండోసెట్ పత్రాలు సమర్పించేందుకు నిర్ణయించుకున్నారు. ఎవరి సెంటిమెంటు ప్రకారం వాళ్లు ముందుగా ఇష్టదైవాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేస్తుండగా మరికొంత మంది నేతలు మాత్రం కార్యకర్తలను మించిన దేవుళ్లు లేరంటూ వారి సమక్షంలోనే నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధయ్యారు.
భద్రకాళి మీద భరోసా.....
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థులు అంతా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన తరువాతే నామినేషన్లు వేయనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్, బీజేపీ అభ్యర్థి మార్తినేని ధర్మారావు, బీజేపీ వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి నామినేషన్లు సమర్పిస్తున్న వారిలో ఉన్నారు. వీళ్లంతా స్వతహాగానే మహాశక్తి భక్తులు కావటంతో అందరూ ముందుగా భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు సమర్పించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి నామినేషన్ వేయనున్నారు. అంతకు ముందు వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఇతర ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం నామినేషన్ దాఖలు చేస్తార.బీజేపీ అభ్యర్థి మార్తినేని ధర్మారావు హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. 19న మరో సెట్ నామినేషన్ ర్యాలీగా వెళ్లి దాఖలు చేయనున్నారు. బీజేపీ నుంచి ఆశావహా అభ్యర్థి, పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ భద్రకాళి దేవస్థానానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పార్టీ నాయకులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు.
కార్యకర్తలే దేవుళ్లు....
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహా అభ్యర్థి, ఆ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అందరినీ నమ్మాడు. చివరకు ఎవరూ సాయం కాలేదు. దీంతో కాస్త నిర్వేదం, ఆగ్రహంతో ఉన్న ఆయన కార్యకర్త దేవుళ్లను నమ్ముకొని నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇంటి నుంచి నేరుగా పార్టీ నాయకులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముందుగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఈ నెల 15న ర్యాలీగా వెళ్లి మరోసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గట్టమ్మ తల్లికి, లక్ష్మీనరసింహస్వామికి మొక్కి..
భూపాలపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి మధుసూదనాచారి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ నుంచి సీటు, బీ పారం రాకున్నా గండ్ర వెంకటరమణారెడ్డి నామినేషన్ వేయనున్నారు. మధుసూదనాచారి రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేయనున్నారు. గండ్ర సత్యనారాయణరావు కూడా ఇక్కడే పూజలు చేసిన అనంతరం నామినేషన్ సమర్పించనున్నారు. బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ టెంపుల్‌లో దర్శనం చేసుకున్న తర్వాత నామినేషన్ వేయనున్నారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున సీతక్క, టీఆర్‌ఎస్ తరుపున చందూలాల్ గట్టమ్మ దేవాలయంలో దర్శించుకున్న అనంతరం నామినేషన్ వేయనున్నారు. చందూలాల్ 1:45 గంటలకు వేయనున్నారు.
కురవి వీరన్న అనుగ్రహంతో...
టీఆర్‌ఎస్ మహబూబాబాద్ అభ్యర్థి శంకర్‌నాయక్ , డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రునాయక్ కురవి వీరభద్రున్ని దర్శించుకొని నామినేషన్లు సమర్పించనున్నారు. ఇక డోర్నకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్ తన నియోజకవర్గంలోని ప్రతి మండల పార్టీ అధ్యక్షులను వెంటబెట్టుకొని వెళ్లి నామినేషన్ వేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందని రెడ్యానాయక్ అనుచరులు చెప్తున్నారు.
అన్నిటికీ రేణుకఎల్లమ్మ తల్లే....
జనగామ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆనవాయితీగా రేణుకా ఎల్లమ్మకు దండం పెట్టుకొని నామినేషన్ వేస్తున్నారు. యశ్వంతాపూర్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆయన నేడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేణుక ఎల్లమ్మ ఆలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు చేయించిన తరువాతే సమర్పించారు. ఇంట్లో నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి 1.45 గంటలకు ఆలయానికి వెళతారు. అక్కడ నుంచి రెవెన్యూ డివిజనల్(ఆర్‌వో) కార్యాలయానికి చేరుకుంటారు. తనతో పాటు మరో నలుగురు నాయకులను వెంట తీసుకెళ్లి మధ్యాహ్నం 2.30 గంటలకు రెండు నామినేషన్ సెట్లను ఆర్‌ఓకు అందజేయనున్నారు.
17వ తేదీన జనసమీకరణతో మరో సెట్టు వేయనున్నట్లు ముత్తిరెడ్డి తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య సెంటిమెంట్ ప్రకారం మొదట స్థానిక చర్చిలో, అనంతరం ఘన్‌పూర్, శివునిపల్లి బొడ్రాయిల వద్ద, అనంతరం స్థానిక మజీద్‌లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ర్యాలీగా ఆర్‌వో కార్యాలయం(తహసీల్దార్ కార్యాలయం) వరకు వెళ్లి మధ్యాహ్నం 1.45 నుంచి 2గంటల 30 నిమిషాల మధ్యలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ప్రాముఖ్యత ఈ రోజునే ఎందుకు?
వారాధిపతి బుధుడు, సప్తమి తిథి , శ్రవణానక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు (కార్తీకమాసం) అన్నీ కలిసి వచ్చిన శుభదినం ఇది. శ్రావణ నక్షత్రం అనగా శుభకారకుడైన చంద్రుడు. చంద్రుని ఆశీర్వాదాన్ని కోరుకొని పనులు ప్రారంభించిన వారి మాటలను ఎదుటివారు అంగీకరిస్తారు. ఎదుటివారి నుంచి వచ్చే కోపావేశాలు తగ్గిపోతాయి. ఉదయం 10.43 వరకు వర్జ్యం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 12:40 గంటల వరకు ఉన్న మకరలగ్నానికి ఏకాదశస్థానంలో గురు, బుధ గ్రహాలు శుభదృష్టితో ఉంటాయి కాబట్టి ఇవి శుభ ఘడియలుగా భావిస్తారు.
మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3.30గంటల వరకు మీన లగ్నంలో గురు, బుధ గ్రహాలు తొమ్మిదో స్థానంలో ఉండడంతో పాటు మకరలగ్నంలో చంద్రుడు, కేతువు, 11వ స్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో తలపెట్టిన కార్యాలు అనుకూల విజయానికి దారితీస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఎక్కువమంది ఇవే ఘడియల్లో నామినేషన్లు వేయటానికి సిద్ధమయ్యారు.
నర్సంపేటలో పెద్ది...
నర్సంపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి దేవుళ్ల కంటే కార్యకర్తలపట్లనే ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్ పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత నామినేషన్ వేస్తారు. వర్ధన్నపేట నుంచి అరూరి రమేష్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ వేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment