సాక్షి, వరంగల్ రూరల్: ఆట మొదలైంది.. నియోజకవర్గాల్లో సరికొత్త సమరం ఆరంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ముందస్తు సమరంలో అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రచారం దిశగా సిద్ధపడడం.. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి వ్యూహాలు రచించడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అభ్యర్థుల సందడి, పార్టీల హడావుడి, నేతల ప్రసంగాలు, సమావేశాలతో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
నామినేషన్ల స్వీకరణ షురూ..
ఈ నెల 12 నుంచి ఈ నెల 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఉంటుంది. డిసెంబర్ 7న ఎన్నికలు, 11న ఫలితాలు ప్రకటించనున్నారు. తొలిరోజు పరకాల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గంలో ఇండిపెండెంటెంట్‌గా వీరమల్ల రాజేష్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
ముుహూర్తాలు చూసుకుంటున్న అభ్యర్థులు
నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అయ్యగార్లను సంప్రదించి నామినేషన్ వేసే తేదీలను ఖరారు చేసుకుంటున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులకు బీ ఫాంలు అందించారు. ఈ నెల 14న పరకాల టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, వర్దన్నపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్, భూపాలపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి, ఈ నెల 17న పాలకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ నెల 18న నర్సంపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
ఇంకా ప్రకటించని ప్రజాకూటమి..
ఓ పక్క నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా మహాకూటమి అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. దీంతో మహాకూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. బీఎల్‌ఎఫ్ నర్సంపేట అభ్యర్థిగా మద్దికాయల అశోక్‌ను ఇదివరకే ప్రకటించారు. నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రజా సేవకుడిగా ఉంటా..
పరకాల: 30 ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న తనపై ప్రజల్లో ఉన్న గౌరవం, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తన గెలుపునకు దోహదపడుతాయని బీజేపీ పరకాల నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్ మహేందర్‌జీకి మధ్యాహ్నం 2.16 గంటలకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. పరకాల నియోజకవర్గంలో మొదటి నామినేషన్ డాక్టర్ విజయచందర్‌రెడ్డితో మొదలైంది.
మరో నామినేషన్ పత్రాన్ని ఆయన సతీమణి సుదేష్ణారెడ్డి దాఖలు చేసేందుకు వెళ్లగా సమయం దాటిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిరాకరించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, జిల్లా నాయకులు దేవేందర్‌రెడ్డి, ముత్యాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కానుగుల గోపీనాథ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆర్‌పీ జయంత్‌లాల్, మేకల రాజవీర్ పాల్గొన్నారు.ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరమల్ల రాజేశ్‌రెడ్డినర్సంపేట: నియోజకవర్గ మొదటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మహేశ్వరం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్‌రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment