దారికొచ్చిన రెబల్స్ | nominations withdrawl | Sakshi
Sakshi News home page

దారికొచ్చిన రెబల్స్

Published Sun, Apr 13 2014 2:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

దారికొచ్చిన   రెబల్స్ - Sakshi

దారికొచ్చిన రెబల్స్

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రెబల్స్ దారికొచ్చారు. తిరుగుబావుటా ఎగరవేసిన ప్రధాన పార్టీల నాయకులు చివరి రోజు శనివారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తిరుగుబాటుదారులను బుజ్జగించేందుకు ప్రధాన పార్టీల అధిష్టానాలు చేసిన ప్రయత్నాలు దాదాపు ఫలించాయి. జిల్లాలో ఒకటి రెండు చోట్ల మినహా మిగతా అన్ని ప్రధాన పార్టీల రెబల్స్ బరినుంచి తప్పుకోవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఆదిలాబాద్ ఎమ్మెల్యే స్థానానికి డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి తిరుగుబావుటా ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి రావడంతో ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి భార్గవ్‌దేశ్ పాండేకు ప్రధాన రెబల్ బెడద తప్పింది. కానీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ మహిళ నాయకురాలు సిరాజ్‌ఖాన్ మాత్రం బరిలోనే ఉన్నారు.

 బోథ్, ఖానాపూర్ స్థానాలకు నామినేషన్లు వేసిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు కొమ్ర కోటేష్, భరత్ చౌహాన్‌లు కూడా బరి నుంచి తప్పుకున్నారు. చెన్నూర్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి నామినేషన్ వేసిన ఆ పార్టీ నాయకుడు దాసారపు శ్రీనివాస్ కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
 
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం నిర్మల్‌లో బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి సాంకేతికంగా రెబల్ బెడద ఉన్నట్లే అయ్యింది. అలాగే సిర్పూర్‌లో కోనేరు కోనప్ప కూడా బీఎస్పీ తరఫున బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానానికి సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్.. నియోజకవర్గ ఇన్‌చార్జి చిలుముల శంకర్‌ను బరిలో నిలిపి కామ్రెడ్లకు చెయ్యిచ్చింది.

దీంతో సీపీఐ పార్టీ జిల్లాలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి జైరాంరమేష్, పొన్నాల లక్ష్మయ్యల మంత్రాంగం ఫలించండంతో ఆ పార్టీ అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు.
 
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా తిరుగుబాటుదారుల బెడద తప్పింది. సిర్పూర్‌లో తన కుమారుడితో నామినేషన్ వేయించిన పాల్వాయి రాజ్యలక్ష్మి తన కుమారుని నామినేషన్ ఉపసంహరింపచేసుకున్నారు. కాని టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఆ పార్టీ మైనార్టీ నాయకులు జబ్బార్‌ఖాన్ మాత్రం బరిలోనే ఉన్నారు.
 
ఆసిఫాబాద్ స్థానానికి టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పెందూర్ గోపి పోటీలో ఉంటున్నారు. దీం తో ఇక్కడి టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మీకు తిరుగుబాటు అభ్యర్థి బెడద తప్పడం లేదు. మంచిర్యాలలో నామినేష న్ వేసిన టీఆర్‌ఎస్ నాయకులు సిరిపురం రాజేష్ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. ఖానాపూర్‌లో విజయలక్ష్మీచౌహాన్ బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు.
 
టీడీపీ రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఆ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించాయి. సిర్పూర్ స్థానం నుంచి నామినేషన్ వేసిన పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చిలింగం ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. రాథోడ్ రమేష్‌తో మంతనాలు జరిపిన ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకొని బరి నుంచి తప్పుకున్నారు.

చెన్నూర్ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దుర్గం నరేష్ కూడా నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ-టీడీపీ పొత్తుకు భంగం కలగలేదు. కానీ ఇక్కడ బీజేపీ రెబల్ అభ్యర్థి అందుగుల శ్రీనివాస్ మాత్రం బరిలో ఉండడంతో బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రాంవేణుకు తిరుగుబాటు అభ్యర్థి బెడద తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement