
స్పీకర్‌పై టీడీపీ అవిశ్వాసం?
తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీటీడీపీ యోచిస్తోంది.
- జానాతో ఎర్రబెల్లి, రేవంత్ చర్చ
- నేడు నోటీసు ఇవ్వాలని నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీటీడీపీ యోచిస్తోంది. అందుకుగల అవకాశాలు, అవిశ్వాసం పెట్టిన తర్వాత ఉత్పన్నం కాబోయే అంశాలపై చర్చించడానికి టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్‌రెడ్డి గురువారం సీఎల్పీ నాయకుడు జానారెడ్డిని కలిశారు. నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కీలక సమయం లో ఒకసెషన్ మొత్తం, ఒక పార్టీని ఏకపక్షం గా సస్పెండ్ చేయడం చరిత్రలో ఎక్కడా లేదని వివరించినట్టుగా సమాచారం. పార్టీ ఫిరాయింపులు, మంత్రిగా తలసాని కొన సాగింపుపై తాము ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని, ఇందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం నోటీసివ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతోనూ చర్చించారు.
టీడీపీపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
తెలుగుదేశం పార్టీ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కలసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయగీతాన్ని అవమానించారని, వారంతా బేషరతుగా సభకు క్షమాపణ చెప్పాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆ మరుసటి రోజు సభలో స్పీకర్‌ను, పోడియంను చుట్టుముట్టడంతో టీడీపీ సభ్యులు 11మందిని ఈ సెషన్స్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం సబబు కాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు స్పీకర్‌ను కలిశారు. కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ ఎల్పీనేత డాక్టర్ లక్ష్మణ్, సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీంద్రకుమార్‌లు స్పీకర్‌ను కలసి చర్చించారు. ఇదే సమయంలో పద్దులపై చర్చకు తాము సమయం అడిగామని, కనీసం అధ్యయనం చేయకుండా చర్చలో ఎలా పాల్గొంటామని స్పీకర్‌కు వివరించినట్లు బీజేపీ ఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏ రోజు డిమాండ్‌లు ఆ రోజు పూర్తి చేయాలనుకోవడం వరకూ ఓకే కానీ అప్పటికప్పుడే తాము ఎలా తయారై చర్చిస్తామని ఆయన ప్రశ్నించారు.