నేటి సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు
హైదరాబాద్: అసెంబ్లీలో తమ హక్కులను కాలరాయడంపై నిరసనగా నేడు సమావేశాలను ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ నేతలు బహిష్కరించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారారిని టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య కలిశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సభలో విపక్ష సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని, విపక్ష సభ్యులను సభలో మాట్లాడనివ్వడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నిన్న అసెంబ్లీలో భూ సేకరణ బిల్లు ఆమోదం సందర్భంగా నిరసన తెలిపి వాకౌట్ చేసే టైమ్ ఇవ్వకపోవడంపై స్పీకర్ తీరును టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. స్పీకర్ తీరును నిరసిస్తూ లేఖ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పదే పదే చెబుతున్నా స్పీకర్ వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. అందుకే అసెంబ్లీని బహిష్కరించాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు రేవంత్ వెల్లడించారు. తమతో పాటు అసెంబ్లీని బహిష్కరించాలని కాంగ్రెస్, సీపీఎం నేతలను కోరామని, బీజేపీ నేతలు ఆలోచించి చెబుతామని పేర్కొన్నట్లు వివరించారు.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై స్పీకర్‌ను కలిశారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, తమకు టైమ్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో విపక్షాలకు తలెత్తుతున్న సమస్యలపై స్పీకర్‌కు తెలియజేస్తూ కాంగ్రెస్ నేతలు లేఖ అందజేశారు. స్పీకర్ తీరుకు నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తామని తమ లేఖలో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నట్లు సమాచారం. ప్రాజెక్టులు, భూ సేకరణ చట్టం ఆమోదంపై నిన్న సభ జరిగిన తీరుపై నిరసనగా కాంగ్రెస్ నేతలు నేడు సమావేశాలను బహిష్కరించారు.