ప్రతిపక్షాలను ఎప్పుడూ అవమానించలేదు: కేసీఆర్
హైదరాబాద్: ప్రతిపక్షాలు నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకుని సభకు తిరిగి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలను మేమెప్పుడూ అవమానించిన దాఖలాలు లేవని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నిరోజులైనా సరే సభను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితిపై బీజేపీ నేత కిషన్ రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. రేపు తెలంగాణ బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీని ఇంకా ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చ జరగనుంది. సంక్రాంతి వరకు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు అసెంబ్లీలో తమ హక్కులను కాలరాయడంపై నిరసనగా ప్రతిపక్ష టీడీపీ నేతలు, జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు నేడు సమావేశాలను బహిష్కరించారు. నేటి ఉదయం ఈ విషయంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారారిని టీడీపీ, కాంగ్రెస్ నేతలు కలిసి తమ లేఖ అందజేశారు. నిన్న అసెంబ్లీలో భూ సేకరణ బిల్లు ఆమోదం సందర్భంగా నిరసన తెలిపి వాకౌట్ చేసే టైమ్ ఇవ్వకపోవడంపై స్పీకర్ తీరును టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. అందుకే అసెంబ్లీని బహిష్కరించాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు రేవంత్ వెల్లడించారు.