నీరు ఇవ్వలేం
‘శ్రీరాంసాగర్’ ఆయకట్టులో వరికి సెలవే
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
చిన్న కాల్వలను ఆధునికీకరిస్తాం
ఎస్సారెస్పీ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి
‘ఈ ఖరీఫ్‌లో శ్రీరాంసాగర్ ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటి విడుదల సాధ్యం కాదు. ప్రాజెక్టులోకి ఇప్పుడు చుక్క ఇన్‌ఫ్లో లేదు. ఆగస్టు నెలపై చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ.. వరుణుడు కరుణించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాకు సాగునీరు ఇవ్వలేం. ఆయకట్టు రైతులు ఈ ఖరీఫ్‌లో క్రాప్‌హాలిడే ఇవ్వాల్సిందే.’ అని ఎస్సారెస్పీ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా ఖరీఫ్ ప్రణాళిక అడగలేదని, ఖరీఫ్‌లో కాల్వ నీటిపై రైతులు ఆశలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పారు.
హన్మకొండ : ‘శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 23.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టులో కనీసం 70 టీఎంసీలు ఉంటేనే సాగునీరు విడుదల చేస్తాం. మహారాష్ట్ర ఎగువన వర్షాలు లేకపోవడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి నీరు రావడం లేదు. ఈ పరిస్థితిలో జిల్లాకు సాగునీరు ఇవ్వలేం’ అని ఎస్సారెస్పీ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సారెస్పీ ఆయకట్టు సాగుపై ‘సాక్షి’ మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే...
జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వల కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వలు కొంత అధ్వానంగా ఉండడంతో ప్రతి సీజన్‌లో 3 లక్షల ఎకరాల వరకు నీటిని సరఫరా చేయగలుగుతున్నాం. గత రబీ సీజన్‌లో తొమ్మిది విడతలుగా వారబందీ ప్రకారం నీటిని ఇచ్చాం. కానీ, ఇప్పుడు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం లేదు. ఎల్‌ఎండీలో 9.1 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జిల్లాలోని కాల్వల కింద ఆయకట్టుకు నీటిని అందించాలంటే సరాసరి 35 టీఎంసీల నీరు అవసరం పడుతోంది. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో నీటిని అందించడం సాధ్యం కాదు. తాగునీటి అవసరాల దృష్ట్యా ఎల్‌ఎండీ నుంచి మరో 2 టీఎంసీలు ఇస్తామని ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే సూచించారు. గోదావరి ప్రవహిస్తుండటంతో ఇప్పటికిప్పుడు ఎస్సారెస్పీ నీటిని నిల్వ చేసి, దేవాదుల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్, వడ్డేపల్లి చెరువులలో నీటిని నింపుతున్నాం. వీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తాం. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు సాగునీటిని అందించలేం. అయితే ఇప్పటికే చాలా మంది ఆయకట్టుదారులు నాట్లు వేశారు. కానీ, ముందు నుంచీ రైతులకు చెబుతూనే ఉన్నాం. ప్రత్యేక నోటీసులిచ్చాం. వరి పంటలు వేస్తే నష్టపోతారని. ఆగస్టులో వర్షాలు కురుస్తాయని చూశాం. మహారాష్ట్రలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద వచ్చే దిగువ ప్రాంతాల్లో వర్షపాతం లేదు. దీంతో ప్రస్తుతం ఒక్క చుక్క ఇన్‌ఫ్లో కూడా లేదు. దీంతో ఈసారి ఖరీఫ్‌కు కాల్వల ఆయకట్టుకు నీరివ్వలేం.
4.24 లక్షల ఎకరాల్లో క్రాప్‌హాలిడే
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరందించే 4.24 లక్షల ఎకరాలు ఈసారి క్రాప్‌హాలిడే పాటించాల్సిందే. లేకుంటే ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేం. ఆగస్టు దాటి ఎంతో కొంత వర్షాలు కురిస్తే.. ఆరుతడి పంటలకు రెండు, మూడో తడుల నీరిచ్చే అవకాశం ఉంది. వాటిపై కూడా ఆశలు పెట్టుకోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూ స్తూ ఆయకట్టులో పంటలు వేయొద్దు. నీరిచ్చే అవకాశం లేనందువల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కాల్వ నీరు విడుదల చేసే అవకాశం లేకపోవడంతో కాల్వల ఆధునీకరణ పనులు చేస్తున్నాం. ప్రధాన కాల్వ, ఉప కాల్వల మరమ్మతు పనులు చేయాలని ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం డీబీఎం-48లో పనులు జరుగుతున్నాయి. స్టేజ్-1లోని ఆయా ప్రధాన కాల్వలతోపాటు చిన్న కాల్వలు, ఉప కాల్వలను ఆధునీకరిస్తాం. కొన్నిచోట్ల చాలా మట్టి పేరుకుపోయింది. వాటిని మరమ్మతులు చేస్తాం.