ఊగిసలాటలో ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రం | not to start work for Fluoride Research Center | Sakshi
Sakshi News home page

ఊగిసలాటలో ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రం

Published Tue, Feb 28 2017 9:42 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

not to start work for Fluoride Research Center

ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలో ఫ్లోరైడ్‌ను తరిమికొట్టేందుకు గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 2012 నవంబర్‌లో రూ. 10 కోట్లను మంజూరు చేసింది. చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటు చేస్తున్న పరిశోధనా కేంద్రానికి ఇప్పటికే స్థలం కేటాయించారు.
 
నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు. ఈ కేంద్రం ఏర్పాటైతే తొమ్మిది రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతోపాటు మంజూరైన గుజరాత్‌ రాష్ట్రంలోని పరిశోధన కేంద్రంలో పనులు ప్రారంభమయ్యాయి. దండుమల్కాపురం కేంద్రంలో పనులు ప్రారంభంకాకపోవడంతో అసలు ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటు అవుతుందా అనే  అనుమానం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. 
 
► చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటుకు నిర్ణయం
► రూ. 100-–250 కోట్లతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన 
► తాత్కాలికంగా రూ.10 కోట్లు కేటాయింపు
► పూర్తి స్థాయి నిధుల రాక ప్రారంభం కాని పనులు
 
చౌటుప్పల్‌ :
ఫ్లోరోసిస్‌ వ్యాధి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది నల్లగొండ జిల్లా. అందులో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం. ఇక్కడి ఫ్లోరైడ్‌ శాతం ప్రపంచంలోకెల్లా అత్యధికమని ఎన్నో సంవత్సరాలు చేసిన పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. ఫ్లోరైడ్‌ వ్యాధి, వ్యాధిగ్రస్తులకు చేపట్టాల్సిన చర్యలపై సంవత్సరాల పాటు పరిశోధనలు జరిగాయి. ఫ్లోరైడ్‌పై పాలకుల తీరును నిరసిస్తూ భాధితులు, స్వచ్ఛంద సంఘాల అధ్వర్యంలో జాతీ య స్థాయి ఉద్యమాలు సైతం జరిగాయి. దశాబ్దాల పోరా టం ఫలితంగా 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వ్యాధి నివారణకు, వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్సలను అందించాలని భావించింది. అందులో భాగం గా ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రాలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రం నీటి, శానిటేషన్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే రెండు ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు 2012 నవంబర్‌ నెలలో అధికారిక మంజూరు ఇచ్చింది. వీటిలో ఒకటి గుజ రాత్‌ రాష్ట్రంలో, రెండోది తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఏర్పాటుకు నిర్ణయించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక అవసరాల నిమిత్తం ఒక్కొ కేంద్రానికి రూ. 10కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఇది జరిగి నాలుగేళ్లు గడిచినా ఎలాంటి పురోగతి లేదు. ఈ ప్రాజెక్ట్‌ ఇక్కడే ఉంటుందో లేక వేరే రాష్ట్రానికి తరలిపోతుందో తెలియక ప్రస్తుతం ఊగిసలాట నెలకొంది. 
 
రూ.100–250 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదన
హైదరాబాద్‌కు సమీపంలో,  విజయవాడ జాతీయ రహదారి కలిగి ఉండడం మూలంగా ఈ ఫ్లోరైడ్‌ పరిశోధనా కేంద్రం దండుమల్కాపురం గ్రామంలో ఏర్పాటుకు దోహదపడింది. ఇందుకోసం 65వ నంబర్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న 486 సర్వే నంబరులో 7 ఎకరాలను ప్రభుత్వం కేటాయించి ఇప్పటికే ఆసంస్థకు అందజేసింది. స్థల కేటాయింపులో మొదట్లో కొంత వివాదం నెలకొన్నా స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో సద్దుమణిగింది. రూ.100-–250 కోట్ల వ్యయంతో ఈ కేం ద్రాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని భావించా రు. భూమి కేటాయించి రెండేళ్లు కావొస్తున్నా కేంద్రం నిధు లు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.
 
దేశవ్యాప్త ప్రయోజనాలకు రూపకల్పన 
తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఈ పరిశోధనా కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. తెలంగాణలోని కేంద్రం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు సేవలు అందనున్నాయి. గుజరాత్‌ కేంద్రం ద్వారా మిగిలిన రాష్ట్రాలకు సేవలు అందనున్నాయి. తెలంగాణ పనులను నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(జాతీయ పోషకాహార సంస్థ)కు, గుజరాత్‌ బాధ్యతలను గుజరాత్‌ జల్‌సేవా ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అప్పగించారు.
 
వ్యాధిగ్రస్తులకు సూపర్‌స్పెషాలిటీ వైద్యం
ఈ ఫ్లోరైడ్‌ పరిశోధన కేంద్రాలకు అనుసంధానంగా అదే ప్రాంగణంలో అన్ని హంగులతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. ఫ్లోరోసిస్‌పై పరిశోధనలతోపాటు వ్యాధిగ్రస్తులకు అన్నిరకాల వైద్య సేవలు అందించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 965 గ్రామాల్లో, 3327 ఆవాసాల్లో ఫ్లోరైడ్‌ శాతం 7.0శాతం ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ గుర్తించింది. ఆ ప్రకారంగా ఆయా గ్రామాలకు చెందిన వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం ఇక్కడికి వచ్చేవారు. కాళ్లు, చేతులు వంకర్లుపోయి కదల్లేక , మెదల్లేక ఇబ్బందులకు గురయ్యే భాదితులకు కొత్త జీవితం లభించేది.
 
నిధుల విడుదలకు తెలియని కారణాలు
ఒక్కో కేంద్రం ఏర్పాటుకు ముందుగా రూ.100కోట్ల చొప్పు న కేటాయించాల్సి ఉంది. పనులు కొనసాగుతుంటే అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేయాలని నిర్ణయిం చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫ్లోరైడ్‌ మహమ్మారిని తరిమికొట్టే విషయంలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామనే ప్రకటించింది.  ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పట్ల కేంద్రం ఎందుకు స్పందించడం లేదో తెలియక స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రంలో మాత్రం పనులు ప్రారంభం కావడం గమనార్హం.
 
ఎక్కడికీ పోనివ్వం
ఈ కేంద్రాన్ని ఇక్కడి నుంచి ఎక్కడికీ పోనివ్వం. ఇక్కడ ఏర్పాటు చాలా అవసరం. కేంద్రం నిధులు విడుదల చేస్తే సరిపోతుంది. నిధులు లేకనే పనులు ప్రారంభం కావడం లేదు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి సైతం తీసుకెళ్లాం. – కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే
 
కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం
ఈ విషయాన్ని ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. త్వర గా నిధులు విడుదల చేయాలని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం సైతం సమస్యను కేం ద్రానికి వివరించింది. త్వరలో నిధులు విడుదల అవుతాయని ఆశిస్తున్నాం. – బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎంపీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement