త్వరలోనే ఉద్యోగాల జాతర
కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా లక్షా ఏడు వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్‌సీ) సభ్యుడు సి.విఠల్ తెలిపారు. బుధవారం జిల్లాలో జరుగుతున్న డిపార్ట్‌మెంటల్ పరీక్షలను పర్యవేక్షించేందుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. ఖాళీల జాబితా అందాక నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన చేయడంలో జాప్యం కారణంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆలస్యమైందని పేర్కొన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో కిందిస్థారుు ఉద్యోగుల నియూమకంతో పాటు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ పారదర్శకతగా ఉంటుందని, అవినీతి, అక్రమాలకు తావు ఉండదని అన్నారు. మొదటిసారిగా నిరుద్యోగుల సౌకర్యార్థం ఆన్‌లైన్ నమోదు ప్రారంభించామన్నారు. ఒక్కసారి నమోదు చేసుకున్న వారికి టీపీఎస్‌సీ సమాచారం ఎప్పటికప్పుడు అందుతుందన్నారు. టీపీఎస్‌సీ వెబ్‌సైట్ ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 12 లక్షల మంది విజిట్ చేశారని ఆయన తెలిపారు.