ఆసరా పింఛన్లను ఇక పై బ్యాంకు ఖాతాల ద్వారా అందజేస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు...
- జాప్యానికి అడ్డుకట్ట.. పారదర్శకతకు పెద్దపీట
- అభివృద్ధికి నమునాగా గజ్వేల్
- నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్: ఆసరా పింఛన్లను ఇక పై బ్యాంకు ఖాతాల ద్వారా అందజేస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖను మంత్రి శనివారంప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం పింఛన్లను పోస్టాఫీస్‌ల ద్వారా అందజేస్తున్నామని.. అయితే పంపిణీలో జాప్యం జరుగుతుందన్నారు. ఇందుకోసం బ్యాంకుల ద్వారానే అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగితే పారదర్శకత పెరిగే అవకాశముందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సేవలను మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఐదు వేల జనాభాకు తప్పనిసరిగా ఓ బ్యాంకు ఉండాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు. కొత్తగా ఏర్పడుతున్న బ్యాంకులు వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ప్రత్యేకించి రైతులకు, మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందించి వారి ఆదరణ చూరగొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి నమునాగా మారుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే పెద్దఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని వెల్లడించారు.
దేశంలోనే నంబర్-2గా పీఎన్‌బీ
సేవల్లో తమ బ్యాంకు దేశంలోనే ఎస్‌బీఐ తర్వాత రెండోస్థానాన్ని ఆక్రమించిందని పంజాబ్ నేషనల్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ ఛటర్జీ అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 61 శాఖలు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్‌పర్సన్ అరుణ, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్‌రావు, గజ్వేల్ నేతలు ఆకుల దేవేందర్, బెండ మధు, కౌన్సిలర్లు రామదాసు, బోస్ పాల్గొన్నారు.