హైదరాబాద్‌సిటీ : తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ (ఎన్‌టీవీపీ) రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖాలకు బ్లాక్ రిబ్బన్‌లు కట్టుకొని గురువారం నిజాం కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ... విద్యార్థుల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు విద్యార్థుల సమస్యలు గాలికొదిలి తన అధికార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రాధాన్యమిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇప్పటికైనా అలాంటి విధానాలను కేసీఆర్ విడనాడాలని, లేకపోతే విద్యార్థులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూల్చివేయడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీవీపీ సభ్యులు చక్రపాణి, రంజిత్, అశోక్, కృష్ణ, జగదీష్, సచిన్, చరణ్, పృథ్వీ, కరణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.