తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్‌లు | Number Of Corona Cases In Telangana Is On Rise | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్‌లు

Published Sat, Apr 18 2020 2:27 AM | Last Updated on Sat, Apr 18 2020 8:07 AM

Number Of Corona Cases In Telangana Is On Rise - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సూర్యాపేట: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గురువారం 50 మందికి పాజిటివ్‌ రాగా, శుక్రవారం ఏకంగా 66 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 766కి చేరుకుంది. ఇప్పటివరకు 18 మంది మరణించగా.. కరోనా నుంచి కోలుకుని 186 మంది ఇంటికి వెళ్లినట్టు శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఆ తర్వాత నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 

సూర్యాపేటలో పెరుగుతున్న కేసులు...
కరోనాతో సూర్యాపేట వణుకుతోంది. ఈ జిల్లాలో గురువారం 16 కేసులు నమోదు కాగా.. తాజాగా మరో 15 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఈ 15 కేసులూ సూర్యాపేట పట్టణంలోనే నమోదయ్యాయి. మార్కెట్‌ బజార్‌లో 12, బీబీగూడెంలో 3 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 54 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రజారోగ్య సంచాలకుడు విడుదల చేసిన బులెటిన్‌లో సూర్యాపేటలో ఇప్పటివరకు 44 కేసులు మాత్రమే నమోదైనట్టు పేర్కొన్నారు. మరోవైపు పాజిటివ్‌ కేసులు పెరగడంతో సూర్యాపేట పట్టణంలోని 48 వార్డులను రెడ్‌జోన్‌ పరిధిలోకి తెచ్చినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. చదవండి: లాక్‌డౌన్‌ సడలిస్తే కష్టమే..! 

13 జిల్లాల్లో 209 కంటైన్మెంట్‌ ప్రాంతాలు...
వైరస్‌ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి చెందగా, శుక్రవారం నాటికి 13 జిల్లాల్లో 209 కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఇందులో తాజాగా 1,09,975 ఇళ్లకు వెళ్లి, 4,39,900 మందిని వైద్య బృందాలు కలిసి వారి వివరాలు సేకరించాయి. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఏవైనా ఉన్నాయా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేసి పరీక్షలు చేస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి నోటిఫైడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

కేంద్ర బృందం రాక...
రాష్ట్రంలో కరోనా ఘంటికలు మోగుతుండటంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఇక్కడ కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించింది. ఆ బృందం సభ్యులు గాంధీ, ఛాతీ ఆస్పత్రులకు వెళ్లి కరోనా బాధితులకు అందుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.

మంచిర్యాల జిల్లాలో కరోనా మరణం
మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా మర ణం సంభవించింది. చెన్నూరు మండలం ముత్తరావుపేట చెందిన మహిళ (46) అనారోగ్యంతో బాధపడుతుంటే  ఆమె కొడుకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించాడు.  వైద్యులు కరోనాగా అనుమానించారు. మంగళవారం కింగ్‌ కోఠి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో  మహిళ   అంబులెన్సులోనే తుదిశ్వాస వదిలింది. అయితే వైద్యులు మృతురాలి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. శుక్రవారం ఫలితాల్లో కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. జిల్లాలో ఇదే తొలి కరోనా పాజిటివ్‌ కేసు. కాగా మృతురాలి నివాసానికి 3 కిలోమీటర్ల పరిధిలో అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.   చదవండి: పాప ఏడుస్తోంది.. పాలు కావాలి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement