సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తిని అంబులెన్స్‌లో తరలించడంలో జరిగిన జాప్యమే కరోనా విస్తరణకు కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుడకుడకు చెందిన వ్యక్తి గత నెల 13న మర్కజ్ వెళ్లి 18న ఇంటికి చేరుకున్నాడు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు చేయాలన్న కేంద్ర ఆదేశాలతో జిల్లా వైద్య సిబ్బంది అతడి వద్దకు గత నెల 25 నుంచి 28 వరకు రెండు, మూడు సార్లు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. తనకు ఏ లక్షణాలు లేవని చెప్పడంతో వైద్య సిబ్బంది వెళ్లిపోయినట్లు తెలిసింది. చికిత్స అనంతరం నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ అయిన సదరు వ్యక్తిని ‘సాక్షి’ పలకరించింది.
‘గత నెల 29న వైద్యాధికారులు నాకు ఫోన్ చేశారు. అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌కు తరలిస్తాం.. సిద్ధంగా ఉండాలన్నారు. పలుసార్లు వైద్యాధికారులు ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుందని చెప్పినా రాలేదు. నాకు లివర్ ఇన్‌ఫెక్షన్ ఉండటంతో వైద్యాధికారి అనుమతితో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉన్న మందుల దుకాణానికి వెళ్లి టానిక్ తెచ్చుకున్నా. 29న రాత్రి 8 గంటలకు నన్ను అంబులెన్స్‌లో క్వారంటైన్‌కు తరలించారు’ అని వివరించాడు. అతడికి పాజిటివ్ రావడంతో మెడికల్ దుకాణంలో పని చేస్తున్న వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఇతడి కాంటాక్టుల నుంచి కూరగాయల మార్కెట్‌కు వైరస్ అంటుకుంది.
అంబులెన్స్ వెంటనే వస్తే మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తి మెడికల్ దుకాణానికి వెళ్లేవాడు కాదు. దీంతో వైరస్ ఈ స్థాయిలో విస్తరించేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎస్పీ ఆర్.భాస్కరన్‌ను వివరణ కోరగా.. కుడకుడకు చెందిన వ్యక్తి గత నెల 23, 25, 29 తేదీల్లో 3 సార్లు మెడికల్ దుకాణానికి వెళ్లాడని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ఈ మూడు రోజులు అతడు మెడికల్ దుకాణానికి వెళ్లి వచ్చినట్లు తేలిందని స్పష్టం చేశారు. 29న ఒక్కరోజే మెడికల్ దుకాణానికి వెళ్లాడన్నది అవాస్తవని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment