
కబ్జాకు ‘అధికారిక’ ముద్ర!
- రూ. 2కోట్ల విలువైన భూమి కాజేసేందుకు కుట్ర
- సత్తుపల్లిలో ‘రియల్’ వ్యాపారానికి యత్నం
సత్తుపల్లి : ఓపెన్ కాస్టు విస్తరణ పుణ్యమా అని సత్తుపల్లి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో భూములకు డిమాండ్ తగ్గుతోంది. ఓపెన్‌కాస్టు ప్రభావం లేని పాతసెంటర్‌లో భూముల రేట్లు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. పొలానికి దారి పేరుతో రూ.2కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కాజేసేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ‘కబ్జాకు దారి..’అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో సత్తుపల్లి తహశీల్దార్ దొడ్డా పుల్లయ్య సర్వే నం.76లో అక్రమంగా దారికి మట్టిపోసిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల కోసం ఇచ్చే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. సర్వే నం.75 నుంచి విడగొట్టిన ప్రభుత్వ భూమిని హైకోర్టు స్టే తొలగించిన తరువాత కంచె ఏర్పాటు చేస్తామన్నారు.
భూమిని కాజేసేందుకు...
ప్రభుత్వ భూమిని ఎలాగైనా కాజేసేం దుకు అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత తన పలుకుబడి ఉపయోగించి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారులు చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలన్నా తల నొప్పి వ్యవహారంగా తయారవుతుందని ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. ఆక్రమణలకు ఎవరూ అడ్డురాకుండా.. పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకుండా రోడ్డువేసే ప్రదేశంలో నిలబెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే వినతిపత్రం అడ్డుపెట్టుకొని..
ఒకప్పుడు ఈ అధికార పార్టీ నేత టీడీపీ లో కీలక నేతగా వ్యవహరించారు. మారి న రాజకీయ పరిస్థితుల్లో అధికార పార్టీ లో ముఖ్యనేతగా చలామణి అవుతున్నా రు. 2009లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు సర్వే నం.76లోని ప్రభుత్వ భూమి నుంచి దారి ఇప్పించం డి అంటూ వినతిపత్రాన్ని అడ్డుపెట్టుకొని.. దారిపేరుతో కబ్జాకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే దారి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వక్రభాష్యం చెపుతూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేయటం పలు సందేహాలకు తావిస్తోంది.
రియల్ ఎస్టేట్ కోసమేనట?
సర్వే నం.24లో ఉన్న మూడెకరాల పొలానికి దారి కావాలంటూ ప్రభుత్వ భూమిని కాజేసేందుకు చేస్తున్న ప్రయత్నం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగు దాగి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అరుుతే వేశ్యకాంతల చెరువుకు ఆనుకొని ఉన్న పొలానికి దారి లేదంటూ కొత్తవాదం తెరపైకి తేవడం పట్ల ఆయకట్టు రైతులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టకు ఆనుకొని ఎడ్లబండ్ల దారి నక్షాలో ఉందని.. భూములన్నీ సమగ్రంగా సర్వే చేస్తే మరిన్ని ఆక్రమణలు వెలుగులోకి వస్తాయని ఆయకట్టు రైతులు అంటున్నారు.