ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా లెక్కల్లో మాత్రం వందల్లోనే కనిపిస్తోంది. ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఎస్‌పీ, అసైన్డ్, ఇనాం, శిఖం భూములు, మున్సిపల్, సీలింగ్ భూముల్లో కబ్జాదారులు పాగా వేశారు. నాయకులు, అధికారుల అండదండలతో ఎన్‌వోసీ, ఆర్‌వోసీలు లేకుండానే ఏకంగా పట్టా మార్పిడి చేసుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి పాల్పడ్డారని అధికారుల సర్వేలో వెల్లడవుతుండటంతో కబ్జాదారుల్లో ఆందోళన నెలకొంది.
సర్వేతో ఆక్రమణలు తేలుస్తాం..
ఖమ్మం అర్బన్ మండలంలో ప్రభుత్వ భూములను సర్వే చేసి ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో తేలుస్తాం. ప్రభుత్వ భూములు హద్దులు నిర్ణయించి, వాటి పరిరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఈ దఫా నిర్వహించే సర్వేలో ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు తేలితే తక్షణం నోటీసులు జారీ చేస్తాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తొలుత ఖమ్మం నగరంలో ఎన్నెస్పీ క్యాంప్‌లో ఉన్న 94 ఎకరాలు సర్వే చేస్తాం.
- వినయ్‌కృష్ణారెడ్డి, ఖమ్మం ఆర్డీవో
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై సర్కారు కొరడా ఝుళిపిస్తోంది. ఖమ్మంలో ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చేందుకు ప్రత్యేక సర్వే బృందాలు రంగంలోకి దిగాయి. రికార్డుల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి కనపడుతున్నా క్షేత్రస్థాయిలో ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో లేకపోవడంపై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా స్పందించింది. జిల్లాకేంద్రంలో ప్రజా అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సరిపడా ప్రభుత్వ భూమి ఉందా..? ఉంటే ఎక్కడ ఉంది..? వాటిని ప్రజల అవసరాలకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశంపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తోంది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు భారీ కసరత్తుకు శ్రీకారం చుట్టింది.
కబ్జాకోరల నుంచి..
ఈ సర్వేతో కబ్జాకోరల్లో చిక్కుకున్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి వివరాలు, అన్యాక్రాంతమైన భూముల చిట్టా వెలుగులోకి రానుంది. దీనికోసం జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆగమేఘాల మీద సర్వేయర్ల బృందంతో క్షేత్రస్థాయి పరిశీలనకు ఉపక్రమించింది. రఘునాథపాలెం మండలం, మున్సిపాలిటీల పరిధిలో చెరువు శిఖం భూములు, సీలింగ్, ఎన్‌ఎస్‌పీ భూములు వెయ్యి ఎకరాలు ఉండగా, వాటిలో సగానికి పైగా ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఆక్రమణలపై సమగ్ర సర్వే నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ‘ఆపరేషన్ భూ రైడింగ్’ పేరుతో జరిపిన సర్వేలో అనేక ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లు తేలింది. అయితే అధికారులు మాత్రం వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మంత్రి ఆదేశాలతో మళ్లీ ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు పరుగులు తీస్తోంది.
రికార్డుల్లో ఫుల్..క్షేత్రస్థాయిలో నిల్
ఖమ్మం నగర పాలక సంస్థకు వివిధ ప్రాంతాల్లో దాదాపు 300 ఎకరాలు భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నా సంస్థకు మాత్రం అంత భూమి ఎక్కడ ఉందో..? వాటికి సంబంధించిన రికార్డులు ఏమయ్యాయో అంతుపట్టని పరిస్థితి ఉంది. త్రీ టౌన్ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల క్రితం మున్సిపాలిటీ కొందరికి సుమారు 100 ఎకరాలు లీజుకు ఇచ్చింది. ఆ తర్వాత ఆ భూమిపై ఎవరికి హక్కు సంక్రమించింది? ఎలా సంక్రమించింది? అనే అంశంపై మాత్రం స్పష్టైమైన ఆధారం కానీ.. రికార్డులు కానీ లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు సంయుక్తంగా చేస్తున్న ఈ సర్వే అనేక ఆక్రమణలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
అద్దె ఇళ్లలో ప్రభుత్వ కార్యాలయాలు..
జిల్లాకేంద్రంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో నిర్వహించాల్సి వస్తోంది. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ భూమి ఉన్నా ఎందుకు ఈ పరిస్థితి నెలకొందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా సరైన ప్రభుత్వ భూమి లభించకపోవడంతో అవి కార్యరూపం దాల్చడం లేదు. గత కొన్నేళ్లుగా జిల్లాకేంద్రంలో నూతన కార్యాలయాల నిర్మాణం చేపట్టని పరిస్థితి ఉంది. ఖమ్మంనగర పాలక సంస్థకు వందలాది ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నా వాస్తవరూపంలో మాత్రం సంస్థ కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి ఎన్‌ఎస్‌పీ భూములపై ఆధారపడాల్సి వస్తుండటం ఆక్రమణలకు నిదర్శనంగా చె బుతున్నారు.
పక్షం రోజుల్లో తేల్చాల్సిందే..
ఖమ్మం నగర పాలకసంస్థ, ఖానాపురం హవేలిలో ఉన్న ప్రభుత్వ భూముల పూర్తి వివరాలు 15 రోజుల్లోగా అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ ల్యాండ్ సర్వే అధికారులను ఆదేశించారు. 15 మంది ల్యాండ్‌సర్వే ఇన్‌స్పెక్టర్లు భూములను గుర్తించి సర్వే చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం అర్బన్, ఖానాపురం హవేలి, ఖమ్మం మున్సిపాలిటీల పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. తాజాగా కబ్జాలకు సంబంధించిన సర్వే నివేదికలను రూపొందించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది.
ఎన్‌ఎస్‌పీ క్యాంపు పరిధిలో 94 ఎకరాలు, లకారం ట్యాంక్‌బండ్ పరిధిలోని సర్వే నంబర్ 234లో 129 ఎకరాలు, పాకబండ బజారులో 34 ఎకరాలు, త్రీటౌన్‌లో 100 ఎకరాలు, రంగనాయకుల గుట్ట వద్ద సర్వే నంబర్ 123లో 189 ఎకరాలు, 217లో 41 ఎకరాలు ఉన్నట్లు అధికారులు లెక్కల్లో పేర్కొంటున్నారు. ఈ భూముల్లో సగానికి పైగా ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తోంది. ఈ వివరాలను పూర్తి లెక్కలతో అందించేందుకు ఎన్‌ఎస్‌పీ, శిఖం, ఇనాం, అసైన్డ్ భూములలో వేర్వేరుగా సర్వే చేసి పూర్తి నివేదికను అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కబ్జాదారుల్లో అలజడి
ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా లెక్కల్లో మాత్రం వందల్లోనే కనిపిస్తోంది. ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఎస్‌పీ, అసైన్డ్, ఇనాం, శిఖం భూములు, మున్సిపల్, సీలింగ్ భూముల్లో కబ్జాదారులు పాగా వేశారు. నాయకులు, అధికారుల అండదండలతో ఎన్‌వోసీ, ఆర్‌వోసీలు లేకుండానే ఏకంగా పట్టా మార్పిడి చేసుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి పాల్పడ్డారు అని అధికారుల తాజా సర్వేలో వెల్లడవుతుండటంతో కబ్జాదారుల్లో ఆందోళన నెలకొంది.
లెక్కలు తేలితేనే ప్రభుత్వ అవసరాలకు భూములు
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పనులకు భూమిని కేటాయించేందుకు పూర్తిస్థాయి లెక్కలు, ఆధారాలు లేవు. తాజాగా ప్రభుత్వ భూముల పూర్వాపరాలను గుర్తించే పనిలో రెవెన్యూ యంత్రాంగం తలమునకలైంది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు, సైన్స్ మ్యూజియం, స్పోర్ట్స్ స్టేడియాలు, ఇతర ప్రజా అవసరాలకు ఈ భూములను వినియోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఎక్కడ? ఎంత??
Published Wed, Dec 31 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement