సాక్షి, సిటీబ్యూరో :వందల ఏళ్ల చరిత్ర, సంస్కతీ సంప్రదాయాలతో అలరారుతున్న నగరం మన హైదరాబాద్. ఆధునికతను అందిపుచ్చుకుని కాలంతో పాటుపరుగులు పెడుతోంది. ఇక్కడ ఉన్న ప్రతి కట్టడానికీ ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అలాంటిదే గోల్కొండ సమీపంలోని షేక్‌పేట్ సరాయి. చాలా కాలంగా దీన్ని పర్యాటక శాఖ, పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ)లు తమ అధీనంలోకి తీసుకోవాలని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సరాయికి సరికొత్త సొబగులు అద్దాలని కోరుతూనే ఉన్నారు. కానీ అడుగులు పడటంలేదు. ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి పర్యాటకులకు
అందుబాటులోకి తేవాలంటున్నారు.
సరాయి అంటే అతిథి గృహం..
సరాయి కట్టడాన్ని క్రీ.శ.1550– 1580 మధ్య ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించారు. సరాయి అంటే విశ్రాంతి గృహం అని అర్థం. అప్పట్లో నగరానికి వ్యాపారం కోసం వచ్చేవారికి, పర్యాటకులకు గెస్ట్ హౌస్‌గా ఉండాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం సరాయి వృథాగా పడి ఉంది.
ఆకట్టుకునే నిర్మాణ శైలి..
సరాయి నిర్మాణ శైలి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మెయిన్ గేట్‌కు రెండు వైపులా 15 చొప్పున 30 గదులను నిర్మించారు. గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఈ గదులు విశాలంగా ఉన్నాయి. సరాయికి కుడివైపు గుర్రాలు, ఒంటెల కోసం వసతి ఉండేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారానికి కుడివైపున చిన్న మసీదు ఉంది. ఇక్కడ ఒకేసారి 500 మంది వరకు ప్రార్థన చేసుకోవచ్చు. అప్పట్లో దీన్ని జామా మసీదు అని పిలిచేవారు. ప్రస్తుతం సరాయికి తాళం వేసి నిరుపయోగంగా ఉంచడంతో పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. నాలుగేళ్ల కిత్రం కొన్ని మరమ్మతులు, లోపల నాపరాళ్లను ఏర్పాటు చేశారు. ఇలా చిన్న చిన్న మరమ్మతులు చేసి మధ్యలోనే పనులు నిలిపివేశారు. దీంతో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పెచ్చులూడి కళావిహీనంగా కనిపిస్తోంది. కాలుష్యం కారణంగా కూడా ఈ నిర్మాణం దెబ్బతింటోంది.
పర్యాటకులకు అందుబాటులోకి తేవాలి..
సరాయికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. లేనిపక్షంలో షాపింగ్ కాంప్లెక్స్‌గా మార్చి రూమ్స్‌ను రెంట్‌కు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తుందనే ప్రతిపాదనలు సైతం గతంలో వచ్చాయి. గోల్కొండతో పాటు నగర సందర్శనుకు వచ్చే పర్యాటకులు సరాయిపై ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు అనుమతి లేకపోవడంతో పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది. దీనికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి తిరిగి పర్యాటకులకు అనుమతికల్పించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment