పల్లెలపై ఫైర్
పచ్చని పల్లెలు మసకబారుతున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు పాతటైర్లను కాల్చి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. అసలు పాత్రదారులు, సూత్రదారులు తెరవెనుకే ఉంటూ బీహార్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన కూలీలతో రాత్రివేళలో ఈ దందా సాగిస్తున్నారు. భరించలేని దుర్వాసనతో ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు
కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట, దోరకుంట గ్రామాల సమీపంలో కొందరు పాతటైర్లను కాల్చి ఫైరింగ్ ఆయిల్‌ను తయారు చేస్తున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ అక్రమ దందాను పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోదాడ పరిసర ప్రాంతాల్లో వీరు పాత టైర్లను సేకరిస్తున్నారు. వీటిని ముక్కలుగా కోసి ఇనుప కొలిమిలో వేసి అత్యధిక ఉష్ణోగ్రతకు గురి చేస్తారు. ఫలితంగా రబ్బరు కరిగి నూనె రూపంలోకి మారుతుంది. ఈ విధంగా మండించేటప్పుడు తీవ్రమైన పొగ, భరించలేని దుర్వాసన వస్తోంది. కొలిమిలో తయారైన నూనెను ముందు పాత డ్రమ్ముల్లో సేకరిస్తారు. దీనిని చల్లార్చడానికి నాలుగైదు రోజులు పడుతుంది. తరువాత దానిని పరిశ్రమలో ఏర్పాటు చేసుకున్న నిల్వ ట్యాంకర్‌లోకి మారుస్తారు. దీనినే వారు ఫైరింగ్ ఆయిల్ అని పిలుస్తారు. ఈ ఆయిల్‌ను సమీపంలోని సిమెంట్ పరిశ్రమల్లో బొగ్గును మండించడానికి వాడుతారు. ఒక్కసారి అంటిస్తే గంటల తరబడి ఆరిపోకుండా బొగ్గును ఈ ఆయిల్ మండిస్తుంది. దీంతో పరిశ్రమల వారు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండడంతో అక్రమార్కులు రెచ్చిపోయి దందాను సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాల కూలీలతో..
భరించలేని దుర్వాసన, అధిక వేడి ఉండడంతో స్థానిక కూలీలు ఈ పరిశ్రమలో పని చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో బీహార్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకవచ్చి ఇక్క డ పని చేయిస్తున్నారు. వారికి రోజుకు రూ.200 చెల్లిస్తున్నారు. టైర్లను కాల్చడంతో వచ్చే ఇనుప తీగలను పాత ఇనుము వారికి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా కొలి మి మండించడానికి టైర్లను కూడా వాడుతుండడంతో బస్తాలకొద్దీ నల్లని బూడిద ఏర్పడుతుం ది. దానిని రాత్రి సమయాల్లో రోడ్ల వెంట, వాగు, వంకల్లో పోస్తుండడంతో నీరు,పరిసరాలు కలుషితమవుతున్నాయి. సమీప గ్రామస్తులు శ్వాససంబంధ వ్యాధుల బారినపడుతున్నారు.
ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ఎక్కడ పాత టైర్ల నుంచి ఫైరింగ్ ఆయిల్ తయారు చేసే పరిశ్రమలకు అనుమతులు లేవు. ఈ దందా కోదాడ సమీపంలో జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటాం.
- జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు
పంచాయతీ అనుమతి లేకుండానే..
రెడ్లకుంట శివారులో సాగుతున్న ఈ దందాకు నిర్వాహకులు పంచాయతీ అనుమతి కూడా తీసుకోలేదని తెలిసింది. పర్యావరణానికి చేటు చేస్తున్నా అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయమేమింటే నిర్వాహకులు పరిశ్రమల శాఖ నుంచి ఓ పని కోసం అనుమతులు తీసుకుని ఈ దందా సాగిస్తున్నట్టు తెలిసింది.