10న కామారెడ్డిలో పొంగులేటి రైతు దీక్ష
కేంద్ర, రాష్ట్రాలకు కనువిప్పు కలిగించేందుకే...
రైతు సమస్యలను సర్కార్ పట్టించుకోవట్లేదు:ఎడ్మ కిష్టారెడ్డి
మొత్తం తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 10న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఒక రోజు రైతు దీక్ష చేయనున్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొననున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేందుకు, రైతుల్లో మనోస్థైర్యం నింపేందుకు దీక్షను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.
మంగళవారం హైదరాబాద్‌లోని (లోటస్‌పాండ్‌లోని) వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కె. శివకుమార్ , నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డిలతో కలసి ఆయన రైతు దీక్ష వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 800 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా రైతు సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని కిష్టారెడ్డి ధ్వజమెత్తారు. కేవలం మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ చేతల్లో మాత్రం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ర్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు తాండవిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఇప్పటికైనా మొత్తం తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతుల పక్షాన పోరాడుతున్న ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీయేనని కె.శివకుమార్ ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో దీక్షలు చేశారని, రైతులకు భరోసానిచ్చేలా పార్టీపరంగా కార్యక్రమాలను చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. కామారెడ్డిలోనే ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, అక్కడి రైతులే అధికంగా నష్టపోయినందున అక్కడ దీక్షను చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
అనైతిక చర్యలకు పాల్పడుతూ నీతి బోధలా?: కొండా
గౌతమ బుద్ధుడు, సత్యహరిశ్చంద్రుడు సిగ్గుపడేలా సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్‌లో నీతి బోధలు చేశారని అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఎద్దేవా చేశారు. వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి అనైతికంగా చేర్చుకోవడమే కాకుండా వారిని పక్కన పెట్టుకుని నీతులు వ ల్లించడం ఆయనకే చెల్లిందని ఎగతాళి చేశారు. కేసీఆర్ సింహంపై స్వారీ చేస్తున్నారని, నేలవిడిచి సాము చేస్తే ఏమవుతుందో ఆయనకు తెలిసొస్తుందన్నారు.
సర్కార్‌పై భ్రమలు పోయాయి..
రాష్ట్ర ప్రభుత్వంపై భ్రమలు పోయాయని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ప్రజల ఆశలు నెరవేరలేదని కిష్టారెడ్డి విమర్శించారు. ఓవైపు కరువు విలయతాండవం చేస్తున్నా, రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆత్మహత్యల బారినపడిన రైతుల కుటుంబాలతో దీక్ష చేయించాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు.
అకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురుగాలులతో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగానికి వెంటనే పెద్ద ఎత్తున సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దివంగత మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా రైతుల ఆత్మబంధువుగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నారన్నారు. పిడుగుపాట్లకు గురై మృతిచెందిన వారితోపాటు గొర్రెలు, మేకలకు కూడా నష్టపరిహారాన్ని వైఎస్ గతంలో చెల్లించిన విషయాన్ని గుర్తుచేశారు.