
జనాభానే ప్రాతిపదిక
రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ (41.68 శాతం), ఆంధ్రప్రదేశ్ (58.32 శాతం) రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు...
- రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ
- రాష్ట్ర స్థాయి సంస్థల్లో పనిచేస్తున్న స్థానిక కేడర్ ఉద్యోగులు వారి స్వస్థలాలకు
- ఈ నెల 10వ తేదీ కల్లా నమూనా పత్రాల్లో వివరాలు ఇవ్వాలి
- అన్ని శాఖలకు రెండు రాష్ట్రాల సీఎస్‌లసర్క్యులర్ మెమో జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ (41.68 శాతం), ఆంధ్రప్రదేశ్ (58.32 శాతం) రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐ.వై.ఆర్. కృష్ణారావులు సంయుక్త సంతకాలతో జారీ చేసిన సర్క్యులర్ మెమోలో స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు, ఖాళీల విభాగాలు, కేటగిరీల వారీగా నిర్ధారించిన నమూనా పత్రాల్లో ఈ నెల 10వ తేదీలోగా ఇవ్వాల్సిందిగా ఆ మెమోలో ఇద్దరు సీఎస్‌లు అన్ని శాఖలను ఆదేశించారు.
రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు, ఉద్యోగుల పంపిణీని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన విభాగం చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర చర్చలతో సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఆ మెమోలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి సంస్థల్లో పనిచేస్తున్న స్థానిక కేడర్ ఉద్యోగులను వారి స్వస్థలాలకు వెనక్కు పంపించనున్నట్లు స్పష్టం చేశారు. పోస్టుల వివరాలు రాగానే ఏ రాష్ట్రానికి ఏ శాఖలో, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులో కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పోస్టుల పంపిణీ వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది, పదవ షెడ్యూల్స్‌లోని సంస్థల్లో పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను కూడా ఇరు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేస్తారు. సచివాలయంతో పాటు రాష్ట్ర స్థాయిలోని పలు శాఖల్లోని పోస్టులను సమాన నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలకు సంయుక్తంగా పంపిణీ చేస్తారు.
రాష్ట్ర స్థాయి కేటగిరీ పోస్టు అయినప్పటికీ ప్రత్యేకంగా ఆ ప్రాంతానికే చెందిన పోస్టు అయితే అది ఏ రాష్ట్రానికి చెందితే ఆ రాష్ట్రానికే కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సంస్థలు, ప్రాజెక్టుల్లోని క్షేత్రస్థాయి పోస్టులను కూడా రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులుగానే పరిగణనలోకి తీసుకుని ఆ పోస్టులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తారు.
రాష్ట్రాల సరిహద్దులోని మల్టీ జోనల్ పోస్టులను, నాన్ గెజిటెడ్ పోస్టులను కూడా రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులుగానే పరిగణించి ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఏదైనా శాఖల్లోని క్షేత్రస్థాయి యూనిట్లు లేకపోతే ఆయా శాఖల్లోని అన్ని రకాల పోస్టులను రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులుగానే భావించి ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు.
ప్రభుత్వ ఉద్యోగులందరూ సివిల్ సర్వీస్ అండ్ సివిల్ పోస్టుల్లో ఉంటే తప్పనిసరిగా ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఏదైనా శాఖలకు క్షేత్రస్థాయి యూనిట్లు ఉండి రాష్ట్రపతి ఉత్తర్వుల కిందకు వస్తే స్థానిక కేడర్, రాష్ట్ర కేడర్ కింద పరిగణిస్తారు. స్థానిక కేడర్‌లో ఉన్నవారు అక్కడే ఉంటారు.
అయితే స్థానిక కేడర్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగులు శాఖాధిపతి, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, ఇనిస్టిట్యూషన్స్, ప్రత్యేక కార్యాలయాలు, ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తుంటే సమాన నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవడం గానీ లేదా వారి స్థానిక కేడర్‌కు తిరిగి పంపించవచ్చు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకుంటారు.