రాజధానిలో పట్టుకు ‘గులాబీ’ తంటాలు! | On to the capital of the 'pink' Troubles! | Sakshi
Sakshi News home page

రాజధానిలో పట్టుకు ‘గులాబీ’ తంటాలు!

Published Tue, Feb 10 2015 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

రాజధానిలో పట్టుకు ‘గులాబీ’ తంటాలు!

రాజధానిలో పట్టుకు ‘గులాబీ’ తంటాలు!

  • జీహెచ్‌ఎంసీలో బలోపేతంపై టీఆర్‌ఎస్ మథనం
  • 10రోజులే గడువున్నా మొదలుకాని సభ్యత్వ నమోదు
  • నగర మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో సతమతం
  • నేడు స్టీరింగ్ కమిటీతో కేసీఆర్ ప్రత్యేక సమావేశం
  • సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌కు రాజధానిలో ఇంకా పట్టు చిక్కడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)పై గులాబీ జెండా ఎగరేయాలని చూస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి తాజా పరిణామాలు జీర్ణం కావడం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోందని పార్టీ వర్గాలు ఆనందంలో ఉన్నాయి. కానీ, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క చోట కూడా సభ్యత్వ నమోదు మొదలు కాలేదు.

    కాకుంటే 18 నియోజకవర్గాల్లో సమావేశాలు జరిపామని, మంత్రులు కూడా హాజరయ్యారని రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. అసలు జీహెచ్‌ఎంసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలోనే పార్టీ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలను నలుగురు మంత్రులకు పంచి, బాధ్యతలు అప్పజెప్పారు. కానీ ఊపు మాత్రం రాలేదు. 20వ తేదీతో సభ్యత్వ నమోదు గడువు ముగియనుంది. మరోవైపు ఒక్క రోజు కూడా గడువు పెంచబోమని సీఎం కె. చంద్రశేఖర్‌రావు తొలిరోజే ప్రకటించారు. దీంతో హైదరాబాద్‌లో పరిస్థితిని తక్షణమే చక్కదిద్దకుంటే అసలుకే ఎసరు వస్తుందన్న ఆందోళనతో మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌తో సమావేశానికి ఏర్పాట్లు చేశారు.
     
    మంత్రుల మధ్య కుదరని సయోధ్య

    నగరంలో నలుగురు మంత్రులున్నా, ప్రధానంగా అందరి దృష్టి టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావుగౌడ్‌పైనే ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ బాధ్యతలను తలసాని ఆశించారని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. తలసాని చేరినప్పటి నుంచే పద్మారావుగౌడ్ కొంత ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఎన్నికల ముందే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మైనంపల్లి హనుమంతరావుకు తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పజె ప్పడంతో పద్మారావుగౌడ్ కూడా కొంత స్థిమితపడ్డారని, అయినా ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు మాత్రం సాగుతూనే ఉందని, అది సభ్యత్వ నమోదుపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

    గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీ గెలుచుకున్న స్థానాలు కేవలం మూడే. ఆ తర్వాత తలసాని, తీగల కృష్ణారెడ్డి టీఆర్ ఎస్‌లోకి రావడంతో ఆ సంఖ్య అయిదుకు పెరిగింది. మొదటి నుంచీ నగరంపై రాజకీయంగా అంతగా పట్టులేని టీఆర్‌ఎస్ ఈసారి మాత్రం గ్రేటర్‌పై జెండా ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్‌ఎస్‌కు అధికార పార్టీ హోదా దక్కడంతో వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ కారణంగానే స్టీరింగ్ కమిటీలో స్థానం కోసం పోటీ ఎక్కువైంది. అందుకే ఏకంగా 57 మందిని ఈ కమిటీలోకి తీసుకోవాల్సి వచ్చింది. కార్పొరేటర్లుగా అవకాశం రావాలంటే స్టీరింగ్ కమిటీలో బాధ్యతలు ఉండాలన్న ఆలోచనతో నేతలు పోటీ పడ్డారు.

    అన్ని నియోజకవర్గాల్లో కొత్త వారి చేరిక ఎక్కువగా ఉండటంతో వారి బలాబలాలను పార్టీ నాయకత్వం అంచనా వేయలేక పోయిందంటున్నారు. దీంతో ఎవరినీ పక్కన పెట్టలేక జంబో కమిటీని ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్ది, తక్షణం పార్టీని పట్టాలెక్కించడానికి సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు, నగర పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారంనాటి సమావేశానికి హాజరుకానున్నారు. కేసీఆర్ నిర్దేశంతోనైనా సభ్యత్వ నమోదు ఊపందుకుంటుందన్న ఆశాభావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement