హోంగార్డ్... కిలోన్నర బంగారం!
హైదరాబాద్: తీగ లాగితే డొంక కదిలిన చందంగా జీడిమెట్ల పోలీసులు ఓ మహిళ ఇచ్చిన చిన్న క్లూ ఆధారంగా విచారణ జరిపి ఇంటి దొంగను పట్టుకుని కేజీన్నర బంగారు నగలు దొంగిలించినట్లు గుర్తించారు. విశ్వసనీయ కథనం ప్రకారం.. బాలానగర్ ఏసీపీ ట్రాఫిక్ పీఎస్‌లో పని చేసే ఓ హోంగార్డు స్నాచర్ అవతారమెత్తి ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా రెండేళ్లుగా స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. కాగా, హెచ్‌ఏఎల్ కాలనీలో మూడుసార్లు అటు ఇటు వాహనంపై తిరుగుతున్న వ్యక్తిని ఓ మహిళ ఫొటో తీసింది. అర గంట క్రితం జరిగిన ఓ స్నాచింగ్‌పై ఆరా తీస్తున్న పోలీసులకు తన వద్ద ఉన్న కీలక ఆధారాన్ని అందించింది. వెంటనే జీడిమెట్ల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి.. సదరు మహిళ ఇచ్చిన ఆధారాల మేరకు ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి..ఓ వ్యక్తి అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
హోంగార్డుగా ఓ వైపు అధికారులతో శభాష్ అనిపించుకుంటూ.. మరో వైపు స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్న ఇతగాడి బాగోతం చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఉదయం ఉద్యోగానికి వచ్చే సమయంలో, మధ్యాహ్నం లంచ్, రాత్రి ఇంటికి .. ఇలా ఏ సమయంలో తనకు చిక్కిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకుని ఏకంగా 50కి పైగా స్నాచింగ్‌లకు పాల్పడి దొంగే దొంగ.. దొంగ.. అన్నట్లుగా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంటూ ఇతర పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు.
ఎట్టకేలకు పాపం పండి పోలీసులకు చిక్కగా ఒక్కొక్కటిగా నిజాలు ఒప్పుకోవడంతో ఇప్పుడు విస్తుపోవడం పోలీసుల వంతైంది. అంతే కాదండోయ్ ఇతగాడికి ఇంట్లో (సూరారం) ఇల్లాలు తో పాటు వంటింట్లో (ఎన్‌ఎల్‌బీ నగర్) ప్రియురాలు అన్నట్లుగా ఇద్దరితో సహజీవనం చేస్తున్నాడు. స్నాచింగ్‌కు పాల్పడిన సొత్తును బ్యాంకుల్లో, తనకు తెలిసిన స్నేహితులకు, పాన్ బోకర్లకు అమ్మి జల్సాలు చేస్తూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పూర్తి వివరాలను సైబరాబాద్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇతగాడి భండారాన్ని బయట పెట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.