
చైన్‌స్నాచర్‌ను పట్టుకున్న మహిళా హోం గార్డ్ చైత్ర
మహిళా హోం గార్డ్ ధైర్య సాహసాలు ప్రదర్శించి పట్టుకున్న సంఘటన నెలమంగల పట్టణ పరిధిలో చోటుచేసుకుంది.
దొడ్డబళ్లాపురం : చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని ఒక మహిళా హోం గార్డ్ ధైర్య సాహసాలు ప్రదర్శించి పట్టుకున్న సంఘటన నెలమంగల పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. నెలమంగల పట్టణ శివారులోని సొండెకొప్ప బైపాస్ వద్ద ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం సొండెకొప్ప వద్ద మహిళా హోం గార్డ్ చైత్ర విధుల్లో ఉంది. ఈ సమయంలో ఉమేశ్ అనే యువకుడు తన స్నేహితుడితో బైక్‌పై వచ్చి అక్కడే నిల్చున్న మహిళ మెడలో గొలుసు తెంపుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు. తక్షణం తేరుకున్న చైత్ర ఉమేశ్ పరారవడానికి ప్రయత్నిస్తుండగా పరుగున వెళ్లి పట్టుకుంది. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా చైత్ర తన పట్టు వదల్లేదు. పట్టుబడ్డ ఉమేశ్‌ను స్థానికులు చితకబాదారు. తరువాత చైత్ర, చైన్‌స్నాచర్ ఉమేశ్‌ను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.