
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
కొణిజర్ల: సరదాగా స్నేహితులతో కలిసి సాగర్ కాల్వలో ఈత కొడదామని వెళ్లారు. మరో స్నేహితుడిని సెల్‌ఫోన్‌లో వీడియో తీయమని చెప్పి ఇద్దరు మిత్రులు కాల్వలోకి దిగారు. కాల్వ బాగా లోతుగా ఉందని, ప్రవాహ వేగం అధికంగా ఉందని అక్కడే ఉన్న అయ్యప్ప మాలధారులు హెచ్చరించినా వినకుండా కాల్వలోకి దిగారు. ప్రవాహ వేగానికి ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా అయ్యప్ప మాలధారులు ఒకరిని బయటకు తీసేలోగా మరో యువకుడు కాల్వలో గల్లంతయ్యాడు. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని తనికెళ్ల సమీపంలోని బోనకల్ బ్రాంచికాల్వ వద్ద జరిగింది. ఎస్‌ఐ చిలువేరు యల్లయ్య, స్థానికుల కథనం ప్రకారం.. బయ్యారం మండలం గంధంపల్లి (కొత్తపేట తండా)కు చెందిన భూక్యా కల్యాణ్(19), కల్లూరు మండలం రావికంపాడుకు చెందిన మార్త గోపాలరావు, డోర్నకల్ మండలం రాములు తండాకు చెందిన నెహ్రూనాయక్ తనికెళ్ల సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్నారు.
ఈ క్రమంలో గురువారం ముగ్గురు కలిసి బోనకల్ బ్రాంచి కాల్వ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. నెహ్రూనాయక్, కల్యాణ్‌లు నీటిలోకి దిగి ఈత కొడుతుండగా గోపాలరావు వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో ప్రవాహ ఉధృతికి ఇద్దరు యువకులు కొట్టుకుని పోతూ కేకలు వేశారు. సమీపంలో స్నానాలు చేస్తున్న అయ్యప్ప మాలధారులు నీటిలోకి దూకి నెహ్రూనాయక్‌ను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే కల్యాణ్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొణిజర్ల తహసీల్దార్ ఎస్.కమల సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతయిన యువకుడి తల్లిదండ్రులు బాలకిషన్, అరుణలు సంఘటనా స్థలానికి చేరుకుని రోదిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ఎస్‌ఐ యల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment