
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలన్న నిబంధన ఉండగా, దాన్ని సడలించాలన్న నిర్ణయానికి వచ్చింది. 2018–19 విద్యా సంవత్సరంలో కాలేజీలకు అనుమతులు ఇచ్చే క్రమంలో ఈ నిబంధనను అమల్లోకి తేనుంది. తద్వారా ఫ్యాకల్టీ లేకున్నా ఉన్నట్లుగా పేపర్‌పై చూపిస్తున్న కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. కాలేజీ యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రెగ్యులర్ అధ్యాపకులు లేకున్నా 20 శాతం వరకు తాత్కాలిక అధ్యాపకులను (అడ్జంక్ట్ ఫ్యాకల్టీ) నియమించుకునేందుకు వీలు కల్పిస్తోంది. అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా రిటైర్ అయిన వారిని, పీహెచ్‌డీ వంటి అర్హతలు లేని వారిని కూడా నియమించుకునే వెసులుబాటు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి కాలేజీల్లో అక్రమాలకు అడ్డకట్ట వేయడంతోపాటు నాణ్యత ప్రమాణాల కోసం పక్కా చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది.
30 శాతం లోపు ప్రవేశాలు రద్దు!
2018–19 విద్యా సంవత్సరంలో అమలు చేసేందుకు తాజా నిబంధనలతో కూడిన ఏఐసీటీఈ అప్రూవల్ హ్యాండ్‌బుక్‌ను వారం రోజుల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు 30 శాతంలోపు ప్రవేశాలు ఉండే కాలేజీలను కొనసాగించడానికి వీల్లేదని, 30 శాతం ప్రవేశాలు ఉంటే దాని నిర్వహణ కూడా యాజమాన్యాలకు సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే 30 శాతం లోపు ప్రవేశాలు ఉన్న కాలేజీల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి తరలించి, ఆయా కాలేజీల్లో ప్రవేశాలను రద్దు చేసే నిబంధనను అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని కాలేజీ యాజమాన్య వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఆగస్టులో ఢిల్లీలో యాజమాన్యాలతో ఏఐసీటీఈ నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలిసింది. కాలేజీలకు మరిన్ని అంశాల్లోనూ మినహాయింపులు ఇవ్వాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. ఇదివరకు పట్టణ ప్రాంతాల్లో కాలేజీకి 10 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధన ఉండగా, దాన్ని 5 ఎకరాలకు తగ్గిస్తున్నట్లు తెలిసింది. మెట్రో ప్రాంతాల్లో 2.5 ఎకరాలు ఉంటే ఇతర కోర్సులను ప్రవేశ పెట్టేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
సిలబస్ కుదింపు!
ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో సిలబస్‌ను కుదించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బీటెక్‌లో ఉన్న 192 క్రెడిట్లను 150 నుంచి 160 వరకు కుదించాలని నిర్ణయించింది. విద్యార్థులకు థియరీ కంటే ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రూపొందించిన మోడల్ సిలబస్‌లో పరిశ్రమలతో అనుసంధానంగా ప్రాక్టికల్‌గా పని చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అయితే ఇది వచ్చే విద్యా సంవత్సరంలో అమలు అవుతుందా, లేదా అన్నది తేలాల్సి ఉంది. 192 నుంచి 150–160 క్రెడిట్లకు తగ్గిస్తూ సిలబస్‌ను కుదించే ప్రక్రియను యూనివర్సిటీలే చేసుకోవాల్సి ఉంటుంది. మోడల్ కరిక్యులమ్ అమలుకు యూనివర్సిటీలు తగిన చర్యలు చేపట్టాలని ఏఐసీటీఈ పేర్కొంది. వీటి అమలుతో విద్యార్థులకు థియరీ కంటే ప్రాక్టికల్స్ ఎక్కువ ఉండనున్నాయి. విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చనే ఉద్దేశంతో ఏఐసీటీఈ ఈ నిర్ణయానికి వచ్చిందని స్టాన్లీ విద్యా సంస్థల కరస్పాండెంట్ కృష్ణారావు పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థులు 150–160 క్రెడిట్లలో 20 క్రెడిట్లను తమ సబ్జెక్టుకు సంబంధించిన ఆన్‌లైన్ కోర్సుల ద్వారా సంపాదించుకోచ్చని వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో ప్రస్తుతం 24 క్రెడిట్లు ఉండగా, వాటిని 17.5 కు తగ్గించాల్సి ఉంటుందని, తర్వాతి మూడేళ్లలోని క్రెడిట్లను తగ్గించేందుకు వర్సిటీలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment