చెప్పులు లేకుండానే వెళ్తున్న భానుచందర్
సాక్షి, కామారెడ్డి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నా.. ఆయన తనయుడు యువనేత జగన్మోహన్‌రెడ్డి అన్నా.. అతడికి వల్లమాలిన అభిమానం. వైఎస్సార్ సీఎంగా అందించిన సంక్షేమ పథకాలు ఆయనను వీరాభిమానిని చేశాయి. వైఎస్సార్ మరణంతో ఆయన ఎంతో కలత చెందాడు. అయితే వైఎస్సార్ ఆశయాల ను నెరవేర్చేందుకు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముందుకు రావడంతో ఆయన కోసం నిరంతరం తపిస్తున్నాడు. జగనన్న సీఎం కావాలని కోరుతూ తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాడు. సీఎం అయ్యేదాక చెప్పులు తొడగనంటూ శపథం చేశాడు. ఆయనే కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఆముదాల భానుచందర్. స్థానికంగా డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గడచిన 16 రోజులుగా చెప్పులు లేకుండా తన పనులు చేసుకుంటున్నాడు. మండుటెండలో కూడా ఆయన కాళ్లకు చెప్పులు తొడగడం లేదు.
వివరాల్లోకి వెళ్తే భానుచందర్ ఐదో తరగతి చదివే సమయంలో దివంగత వైఎస్సార్ మహా పాదయాత్రను చూసి అప్పటి నుంచి ఆయనకు అభిమానిగా మారాడు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్సార్ అంటే ఆయన కు విపరీతమైన అభిమానం పెరిగింది. వైఎస్సార్ మరణంతో కలత చెందిన భానుచందర్, ఆయన ఆశయ సాధన కోసం జగన్మోహన్‌రెడ్డి జనం లో తిరుగుతుండడంతో జగన్‌లో వైఎస్సార్‌ను చూసుకుంటున్నాడు. ఏపీలో ఎన్నికలు రావడంతో జగన్ సీఎం కావాలంటూ తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నాడు. అప్పటిదాకా చెప్పులు ధరించనని శపథం చేశాడు. ఆరోజు నుంచి జగన్ సీఎం కావాలంటూ పూజలు చేస్తున్నాడు. జగన్ సీఎం కాగానే తిరుపతికి కాలినడకన వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment