ప్రమాద దృశ్యం
అన్నపురెడ్డిపల్లి : మండలంలోని బూర్గుగూడెం గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మణుగూరు మండలంలోని కూనవరం గ్రామం పీవీ కాలనీకి చెందిన తాడ్వాయి శ్రీనివాసరావు(43), మూడు నెలల క్రితం టాటా మ్యాజిక్ ఆటో కొన్నాడు. దానికి విజయవాడలో మరమ్మతులు చేయించి, మంగళవారం రాత్రి అక్కడి నుంచి బయల్దేరాడు.
బుధవారం తెల్లవారుజామున బూర్గుగూడెం గ్రామ సమీపంలో, కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వెళుతున్న బొగ్గు టిప్పర్ ఢీకొంది. తాడ్వాయి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్ డేరంగుల నాగరాజు, ప్రయాణిస్తున్న వేమ రవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడ్వాయి శ్రీనివాసరావు భార్య నీలమణి ఫిర్యాదుతో ప్రమాద స్థలాన్ని ఎస్సై కడారి ప్రసాద్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.
బస్సు, రెండు కార్లు ఢీ
కారేపల్లి : ఖమ్మం–ఇల్లందు రహదారిపై అనంతారం తండా స్టేజీ వద్ద బుధవారం బస్సు, రెండు కార్లు ఢీకొన్నాయి. ముప్పు తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఖమ్మం నుంచి ఇల్లందు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు, అనంతారం స్టేజీ వద్ద ప్రయాణికులను దింపేందుకు ఆగింది. వెనుకగా వస్తున్న రెండు కార్లు అదుపుతప్పి ఒక్కసారిగా బస్సును ఢీకొన్నాయి. బస్సు వెనుక భాగం, కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. కార్ల వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రమాద స్థలాన్ని ఎస్‌ఐ కిరణ్ కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నపురెడ్డిపల్లి : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని నామవారం గ్రామం వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన గంటా అజయ్ కుమార్, ద్విచక్ర వాహనంపై అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామం వైపు వెళుతున్నాడు. ఇదే మండలంలోని పెంట్లం గ్రామానికి చెందిన బన్నె నరసింహారావు, రాజాపురం నుంచి ద్విచక్ర వాహనంపై పెంట్లం వెళుతున్నాడు. నామవారం గ్రామం వద్ద ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వాహన చోదకులైన అజయ్‌కుమార్, నరసింహారావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment