- నరికి చంపిన దుండగులు
- మృతదేహం పూడ్చిపెట్టిన వైనం..
బాసర : బాసర గ్రామంలోని పోచమ్మ కాలనీకి చెందిన మెట్టు భీమన్న(50)ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కాళ్లు, చేతులు నరికి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టు భీమన్న రెండ్రోజుల క్రితం కూలీ పని నిమిత్తం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుమారుడు ఎర్రన్న బాసర పరిసర ప్రాంతాల్లో వెతికాడు. కిర్గుల్(బి) రోడు సమీపంలోని వ్యవసాయ పొలంలో భీమన్నకు సంబంధించిన చెప్పలు, దుస్తులు కనిపించాయి.
ఈ విషయమై మంగళవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బుధవారం పరిసర ప్రాంతాల్లో గాలించగా పాడుబడిన బావి సమీపంలోని సంపు వద్ద మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. శవాన్ని బయటకు తీయగా భీమన్నగా నిర్దారించారు. గుర్తు తెలియని వ్యక్తులు భీమన్న చేతులు, కాళ్లు, మెడ నరికి పూడ్చి పెట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. సంఘటన స్తలాన్ని ముథోల్ సీఐ జాదవ్ గణపతి, బాసర ఎస్సై బి.అనిల్, తహశీల్దార్ నారాయణ పరిశీలించి పంచనామా చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.
వరుస హత్యలతో భయం.. భయం..
బాసర గ్రామంలో వరుస హత్యలతో ప్రజలు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. బాసర, మైలాపూర్ గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2013లో బాసర గ్రామానికి చెందిన అశోక్, మణికంఠతోపాటు మరొకరిని ఒకే ఇంట్లో దుండగులు కత్తులతో చంపిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తిని బాసర-నిజామాబాద్ రహదారి సమీపంలో దారుణంగా హత్య చేశారు. ఆ సంఘటనను ప్రజలు మరవకముందే భీమన్న హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.