
మరోసారీ!
పాలమూరు జిల్లాకు మరోసారి అన్యాయం జరిగింది. రైల్వే బడ్జెట్‌లో జిల్లా ప్రస్తావనే లేకుండా పోయింది. కొత్త ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు... పాతవాటి గురించి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంపీల ప్రతిపాదనల్లో కొన్నింటినైనా కేటాయిస్తారనుకున్న జిల్లావాసుల
ఆశలు అడియాశలే
అయ్యాయి.
సాక్షి, మహబూబ్‌నగర్ : రైల్వే బడ్జెట్... ఎప్పటిలాగే పాలమూరుకు పాత కథే మిగిల్చింది. మంగళవారం రైల్వేమంత్రి సదానందగౌడ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో జిల్లాకు కొత్త రైళ్లు వస్తాయని, డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపుతారని అంతా భావించారు. కానీ, ఎప్పటిలాగే ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. కీలకమైన గద్వాల- రాయిచూర్ మార్గానికి ఒక్క రైలూ కేటాయించలేదు. కేవలం డెమో రైలుతోనే నెట్టుకొస్తోంది. జిల్లాకు గతంలో ప్రకటించిన రైళ్ల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. గద్వాల - మాచర్ల వయా వనపర్తి మీదుగా వెళ్లాల్సిన రైల్వేలైన్‌పై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ, వాటి గురించి కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలక్‌నుమా- మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపలేదు. దీంతో రైల్ క్రాసింగ్ ఇబ్బందులు తప్పేట్లు లేదు. జిల్లా గుండా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రాకపోకలు జరుపుతున్న డబుల్ డెక్కర్ రైలు ఇటీవల కాలంలో నిలిచిపోయింది. ఈ రైలు పునరుద్ధరణ పైనా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. రాయిచూర్- గద్వాల మధ్య రైల్వేట్రాక్ అంతా సిద్ధమైనందున కొత్త రైళ్లు కేటాయిస్తారని భావించిన వారికి భంగపాటే ఎదురైంది. గద్వాల మీదుగా చెన్నై- షిరిడీ మధ్య రైళ్ల రాకపోకలు కొనసాగిస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీపై కూడా స్పష్టత ఇవ్వలేదు.
గద్వాల్ రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న 110 ఎకరాల స్థలంలో రైల్వే డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం కాస్త అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. ఏళ్లు గడుస్తున్నా దానికి మోక్షం లభించడంలేదు. రైళ్ల రాకపోకల వల్ల తరచూ రహదారిపై ఉన్న గేట్ పడుతుండడంతో జడ్చర్ల వాసులను తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు. ఎంపీ పంపిన ప్రతిపాదనల్లో కూడా ఆర్వోబీని ప్రముఖంగా ప్రస్తావించడంతో ఈ సారైనా స్థానం దక్కుతుందని ఆశపడ్డారు. కానీ, దానికి కూడా బడ్జెట్‌లో స్థానం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. గుడ్డిలో మెల్లగా మహబూబ్‌నగర్- మునీరాబాద్ రైల్వే లైన్‌కు మాత్రం ఈ సారి కచ్చితంగా 160 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు.
50 రైల్వేగేట్ల వద్ద భద్రతకు చర్యలు
దేశవ్యాప్తంగా కాపాలా లేని రైల్వేగేట్ల వద్ద భద్రత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్టు రైల్వేమంత్రి సదానందగౌడ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇది జిల్లాకు కొంత ఊరట కలిగించనుంది. ఇది అమలైతే జిల్లాలోని 50 కాపలాలేని రైల్వేగేట్ల వద్ద భద్రత పెరగనుంది. దీంతో కొంతవరకు ప్రమాదాలను అరికట్టగలిగే అవకాశం ఉంది.