ఉల్లి వెల్లువ.. | Onion Prices Stable In Hyderabad | Sakshi
Sakshi News home page

ఉల్లి వెల్లువ..

Published Fri, Sep 28 2018 9:34 AM | Last Updated on Fri, Sep 28 2018 9:34 AM

Onion Prices Stable In Hyderabad - Sakshi

ఈ ఏడాది ఉల్లి నగరవాసిని ఇబ్బంది పెట్టలేదు. దిగుమతులు భారీగా ఉండడంతో ఉల్లి ధరలు అదుపులోనే ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో రిటైల్‌ ధర కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.50 వరకు పలికింది. కానీ ఈసారి రూ.15 నుంచి రూ.20 లోపే ఉంది. దీనికి కారణం ప్రతి రోజూ 1500 టన్నుల ఉల్లిగడ్డనగరానికి చేరుతుండడమేనని మార్కెట్‌ వర్గాలు తెలిపారు. హోల్‌సేల్‌ ధర చాలా రోజులుగా రూ.10గానే ఉందని, ఇది సామాన్యులకు ఊరటనిచ్చే అంశమనిఅధికారులు పేర్కొంటున్నారు.   

సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఏటా వర్షాకాలంలో ఉల్లి ధరలు పెరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది కొత్త ఉల్లి పంట మార్కెట్లకు రావడంతో హోల్‌సేల్‌ ధరలు భారీగా తగ్గాయి. దీంతో రిటైల్‌గా కిలో ఉల్లి రూ.15 పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.10 దాటడంలేదని అధికారులు చెబుతున్నారు. కొత్త పంట తెలంగాణ వివిధ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ప్రతిరోజూ దాదాపు 1,500 టన్నుల ఉల్లి మార్కెట్‌కు దిగుమతి అవుతోంది. గత ఏడాది ఈ సీజన్‌లో హోల్‌సేల్‌గా కిలో ఉల్లి రూ.30 వరకు చేరగా ఈ ఏడాది రూ.10లోపే ఉన్నట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సీజన్‌లో మలక్‌పేట్‌ మార్కెట్‌కు 50 నుంచి 60 లారీల ఉల్లి ఉత్పత్తులు వచ్చాయి. ఈ ఏడాది ప్రతిరోజూ 110 లారీల ఉల్లి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉల్లి ఎక్కువ మొత్తంలో దిగుమతులు జరగడంతో రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్నాయి. ఇదే గత ఏడాది రిటైల్‌గా ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు చేరాయి.  

పెరిగిన స్థానిక ఉల్లి దిగుమతులు..
నగర ప్రజల ఉల్లి అవసరాలు దాదాపు 80 శాతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే దిగుమతులతోనే పూర్తి అవుతాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, మెదక్‌తో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతుంది. దీంతో ధరలు పెరగడంలేదు. మున్ముందు ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ఎక్కువగా మార్కెట్‌కు దిగుమతి అయితే దాన్ని నిల్వ చేసుకోవడానికి స్టోరేజీ సౌకర్యం మార్కెట్లలో లేకపోవడంతో హోల్‌సేల్‌ వ్యాపారులు నిల్వ చేసుకుంటున్నారు.

ధరలు అదుపులోనే ఉంటాయి..  
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్త లోకల్‌ ఉల్లి పంట మార్కెట్‌కు ఎక్కువగానే దిగుమతి అవుతోంది. పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.15 వరకు ధర పలుకుతోంది. చిన్న గడ్డకు రూ.8 వరకు ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు ఎక్కువగా పెరగవు. ఎందుకంటే కొత్త పంట రావడంతో ధరలు అదుపులొకి వచ్చాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది దిగుమతులు రెట్టింపు అయ్యాయి.
– అనంతయ్య, స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రటరీ, మలక్‌పేట్‌ మార్కెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement