మొహం చాటేస్తున్న ఉల్లి | Onion Wholesale Price Varies Day To Day | Sakshi
Sakshi News home page

మొహం చాటేస్తున్న ఉల్లి

Published Tue, Dec 17 2019 3:15 AM | Last Updated on Tue, Dec 17 2019 3:15 AM

Onion Wholesale Price Varies Day To Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశీయంగా ఉల్లి ధర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా ఉన్న రోజు ధరలు దిగొస్తుండగా, సరఫరా తగ్గిన రోజు ధరలు పుంజుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల సరఫరాపైనే రాష్ట్రం పూర్తిగా ఆధారపడిన నేపథ్యంలో అక్కడినుంచి ఉల్లి రాక మొహం చాటేస్తుండటంతో ధరల్లో స్థిరత్వం ఉండటం లేదు. రెండ్రోజుల కిందటి వరకు ఉల్లి దిగుమతి ఎక్కువగా ఉండి కాస్త దిగొచ్చినట్లు కనిపించిన మళ్లీ సోమవారం అమాంతం పెరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి సరఫరా నిలిచిపోవడంతో రిటైల్‌ మార్కెట్‌లో రూ.130 వరకు పలుకుతోంది.

మహారాష్ట్రలోనే హెచ్చుతగ్గులు.. 
రాష్ట్రానికి 50శాతానికి పైగా ఉల్లి మహారాష్ట్ర నుంచి వస్తుండగా, అక్కడే ధరల్లో ఏరోజుకారోజు ధరల నిర్ణయం జరుగుతోంది.అది కూడా డిమాండ్, దాని గ్రేడ్‌ ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు పుణే, షోలాపూర్‌లో ఉల్లి ధరలు క్వింటాల్‌కు రూ.80వేల నుంచి రూ.90వేలు పలుకగా, అది సోమవారం రూ.11వేల నుంచి రూ.12వేలకు చేరింది.ఉల్లికి మంచి ధర పలుకుతుండటం, అదే సమయంలో ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల నుంచి డిమాండ్‌ అధికంగా ఉండటంతో రాష్ట్రానికి ఉల్లి సరఫరా తగ్గింది. దీంతో ప్రతిరోజూ మహారాష్ట్ర నుంచి 6వేలకు పైగా బస్తాలు వస్తూ ఉండగా, అది సోమవారం 4వేల బస్తాలకు తగ్గింది.

దీంతో సోమవారం మలక్‌పేట మార్కెట్‌లో గ్రేడ్‌–1 రకం ఉల్లి కిలో రూ.110 పలికింది. ఇది రిటైల్‌ మార్కెట్‌కు వచ్చేసరికి రూ.130 నుంచి రూ.140 పలికింది. గ్రేడ్‌–2 ఉల్లి ధర కిలో రూ.70 నుంచి రూ.60 పలుకగా, అది రిటైల్‌లో రూ.80–90మధ్య పలుకుతోంది. ఇక కర్ణాటక నుంచి ఉల్లి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సోమవారం ఒక్క బస్తా కూడా రాలేదు. అక్కడే డిమాండ్‌ పెరిగిపోవడం, ధర కిలోకు రూ.110 వస్తుండటంతో ఇక్కడికి తీసుకురావడం లేదు. కర్నూలు నుంచి అదే పరిస్థితి ఎదురవుతోంది. అక్కడి ప్రభుత్వమే ఎంత ధరకైనా వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రాయితీపై ప్రజలకు విక్రయిస్తుండటంతో ఏపీలోనే డిమాండ్‌ అధికమైపోయింది. దీంతో తెలంగాణకు సరఫరా తగ్గి ధరలు పెరుగుతున్నాయి. ఇక ఈజిప్టు నుంచి ఉల్లి రావాల్సి ఉన్నా అది ఇంత వరకూ రాలేదు. ఈ ఉల్లి ముంబాయి పోర్టుకు వచ్చాక అక్కడి నుంచి రాష్ట్రానికి లారీల్లో తెచ్చేందుకు మరో రెండు, మూడు రోజులు పట్టొచ్చని మార్కెటింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఒక ఉల్లిపాయ 250 గ్రాములు
చాదర్‌ఘాట్‌: పై ఫొటోలోని ఉల్లిని చూశారా? ఇది ఈజిప్ట్‌ ఉల్లి. ఒక ఉల్లిపాయే 250 గ్రాముల బరువుంది. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఈజిప్టు ఉల్లిని మలక్‌పేట మార్కెట్లో అమ్మాడు. క్వింటాల్‌ రూ.11 వేలకు కొన్నామని, రిటైల్‌లో కిలో రూ.150 వరకూ అమ్మినట్లు తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement