దేవరకద్ర(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు మరింత పెరిగాయి. గత వారం వచ్చిన ధరలే రికార్డు స్థాయిలో ఉండగా ఈ వారం ధరలు మరో రికార్డుగా మారాయి. ప్రభుత్వం ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కిలో రూ.20 కే విక్రయిస్తామంటున్నా ఇక్కడ ఏమాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. అనూహ్యంగా డిమాండ్ పెరగటంతో బుధవారం మార్కెట్‌కు 300 బస్తాల వరకు ఉల్లి పాయలు అమ్మకానికి వచ్చాయి.
జోరుగా సాగిన వేలంలో నాణ్యమైన ఉల్లి క్వింటాల్ ధర రూ. 3500 పలికింది. గత వారం కన్నా ఇది రూ. 300 అధికం. చిన్న సైజు ఉల్లిపాయలకు సైతం అధిక ధరలు నమోదయ్యాయి. మార్కెట్‌లో టోకుగా ఖరీదు చేసిన చిల్లర వ్యాపారులు బయట కిలో రూ.40 వరకు విక్రయించారు.