ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులు, యాచకులు, వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ఆరవ విడత ‘ఆపరేషన్ స్మైల్’పూర్తయింది. మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 3,600 మంది చిన్నారులను పోలీసులు రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించగా.. మిగిలిన వారిని రెస్క్యూ హోంలలో ఉంచారు. రక్షించిన వారిలో 1,292 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం.
ఈసారి నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో మొదటిసారిగా చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖాలు గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ యాప్, దర్పణ్‌లను ఉపయోగించడం కూడా సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్రంలో ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మతపరమైన స్థలాలు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీస్టాళ్లు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ ఆరవ ఆపరేషన్ స్మైల్‌ను మహిళా రక్షణ విభాగం నిర్వహించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహాల్లో ఉన్న పిల్లల డేటాను డిజిటలైజ్ చేయడంతో తప్పిపోయిన, దొరికిన, రక్షించిన పిల్లల ఫొటోలను పోల్చిచూడడానికి సులభంగా మారింది. దర్పణ్ యాప్ ద్వారా కల్వకుర్తి పోలీస్ స్టేషన్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయిన ఇద్దరు పిల్లలను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment