తెలంగాణ వ్యతిరేకులే టీఆర్‌ఎస్‌లోకి..: రాజయ్య
న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణకు బద్ధ వ్యతిరేకులుగా వ్యవహరించిన నేతలే ప్రస్తుతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని, అదేవిధంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా వారినే తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ధ్వజమెత్తారు. ఈ చేరికలు తెలంగాణ పవిత్రతను దెబ్బ తీస్తాయని విమర్శించారు.
తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధంగా, కేవలం అధికారమే పరమావధిగా కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు కాంగ్రెస్ వార్ రూమ్‌కు వచ్చిన రాజయ్య ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ స్వేచ్ఛకు విఘాతం క లిగించే చర్యలకు టీఆర్‌ఎస్ పాల్పడరాదని సూచించారు. తెలంగాణ ఎవరి వల్ల సాధ్యమైందో ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, ఎన్నికల్లో వారు సరైన తీర్పునిస్తారని నొక్కిచెప్పారు. కాంగ్రెస్‌కు మెజార్టీ సీట్లు రావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపై అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్నారు.