
హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా వేస్తామని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు.
పరిగి: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా వేస్తామని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎస్‌ఐ నగేష్‌తో కలిసి శనివారం ఆయన వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహన చోదకులకు జరిమానా విధించారు. హెల్మెట్ వాడకం, టూ వీలర్ ప్రమాదాల పెరుగుదల నేపథ్యంలో ఇటీవల ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించ డంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రమాదాలను నివారించే చర్యలపై దృష్టి సారించాలని ఆర్టీఏ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆ శాఖ అధికారులు హెల్మెట్ వాడకాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో టూ వీలర్లు ఢీకొని, జారి కిందపడి మృత్యువాత పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా మారాయని.. ఇందులో కేవలం హెల్మెట్ లేని కారణంగానే 90 శాతం మృత్యు ఒడికి చేరుతున్నారని అన్నారు. ఇప్పటివరకు 70 శాతం మంది హెల్మెట్లు కొంటున్నా వారిలో 10 శాతం మంది కూడా వాడడం లేదని ఆయన వివరించారు. హెల్మెట్ల వాడకంపై అందరూ సహకరించాలన్నారు. ప్రధానంగా హెల్మెట్లు వాడటం, లెసైన్సు కలిగి ఉండడం, ఇన్సూరెన్సు చేయించుకోవటం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు.