మెట్రో రైలుపై అంచనాలు తప్పాయా? | Over 25 lakh passengers travel by Hyderabad metro rail on 22days | Sakshi
Sakshi News home page

లెక్క మిస్‌ జోరు ప్లస్..

Published Thu, Dec 21 2017 10:19 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Over 25 lakh passengers travel by Hyderabad metro rail on 22days - Sakshi

మహానగరంలో మెట్రో రైలు పరుగుపై అధికారులు పెంచుకున్న అంచనాలు తప్పాయి. నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని భావించగా.. ఇందులో సగం మంది కూడా ప్రయాణించడం లేదు. గ్రేటర్‌లో మెట్రో రైలు పరుగులు మొదలై బుధవారానికి 22 రోజులు పూర్తయ్యాయి. ఈ మధ్య కాలంలో సుమారు 25 లక్షల మంది జాయ్‌రైడ్‌ చేసి ఆనందించారు. శని, ఆదివారాల్లో రద్దీ రెండు లక్షలు కాగా.. మిగతా రోజుల్లో కనాకష్టంగా లక్ష మంది ప్రయాణించారు. దీనికంతటికీ ఆయా స్టేషన్లలో పార్కింగ్‌ సదుపాయం లేకపోవడం, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడమే కారణమని తేలింది.

నగరవాసులకు ప్రయాణ సేవలు అందిస్తున్న ఎంఎంటీఎస్‌పై మెట్రో రైలు ప్రభావం చూపిస్తుందని అంతా భావిస్తే.. ఇప్పుడా లెక్క తప్పని తేలింది. సిటీలో మెట్రో రైలు 22 రోజులుగా పరుగులు తీస్తున్నా ఎంఎంటీఎస్‌కు ప్రయాణికుల ఆదరణ మాత్రం తగ్గలేదు. రోజూ సుమారు 1.50 లక్షల మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు ఎంఎంటీఎస్‌లోనే రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో వల్ల సికింద్రాబాద్‌–హకీంపేట్‌ మార్గంలో కొంతమేర ప్రభావం ఉండవచ్చని మొదట్లో రైల్వే వర్గాలు భావించినా రద్దీ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతోంది. దీనికి ఎంఎంటీఎస్‌ సేవలు ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండడం,  టికెట్‌ ధర కూడా తక్కువ కావడమేనని అధికారులు భావిస్తున్నారు.

22 రోజుల్లో 25 లక్షల మంది మెట్రో జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మెట్రో రైలు పరుగులు తీస్తున్న నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గాల్లో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని తొలుత అధికారులు వేసిన అంచనాలు తల్లకిందులైంది. ఈ 22 రోజుల్లో కేవలం 25 లక్షల మంది మాత్రమే ప్రయాణించినట్టు లెక్క తేల్చారు. అదీ శని, ఆదివారాల్లోనే రద్దీ పెరిగినట్టు గుర్తించారు. మెట్రో నడుస్తున్న మొత్తం 30 కి.మీ. మార్గంలోని 24 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పార్కింగ్‌ సదుపాయం ఉన్న స్టేషన్లు కేవలం ఐదు మాత్రమే. మిగతా 19 స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సమస్య జఠిలంగా మారడంతో వ్యక్తిగత వాహనాలతో స్టేషన్లకు వచ్చినవారికి అగచాట్లు తప్పడంలేదు. 

వసతుల లేమితో వెనుకంజ
నగరంలోని మెట్రో స్టేషన్లకు చేరుకునేందుకు సమీప కాలనీల నుంచి ఆర్టీసీ ఫీడర్‌ బస్సులు అరకొరగానే నడుస్తున్నాయి. ఇక స్టేషన్లకు లక్షలాదిమంది ప్రయాణికులు ఒకేసారిగా తరలివస్తే రద్దీ నియంత్రణ కష్టతరమవుతోంది. స్టేషన్లలో మంచినీరు వసతి అసలే లేకపోవడం, టాయిలెట్‌ వసతులు అరకొరగా ఉండడం.. అదీ పెయిడ్‌ విధానం కావడం పట్ల ప్రయాణికులు మెట్రో ప్రయాణానికి మొగ్గుచూపడం లేనట్టు తెలుస్తోంది. ఇక టోకెన్లు, స్మార్ట్‌కార్డుల కొనుగోలు, వాటి రీచార్జి వంటి అంశాలపై ప్రయాణికులకు సరైన అవగాహన లేకపోవడంతో బాలారిష్టాలు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో గత 22 రోజులుగా మెట్రో నేర్పిన పాఠాలు.. అధికారులు నేర్వాల్సిన గుణపాఠాలు.. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు.. పబ్లిక్‌ డిమాండ్స్‌ ఇలా ఉన్నాయి.. 

పార్కింగ్‌ పరేషాన్‌ పరిష్కరించాలి: మొత్తం 24 స్టేషన్లల్లో మియాపూర్, రసూల్‌పురా, సికింద్రాబాద్‌ పాత జీహెచ్‌ఎంసీ కార్యాలయం, నాగోల్‌ మెట్రో డిపో, చాలిస్‌ మకాన్‌ (అమీర్‌పేట్‌)లో మాత్రమే పార్కింగ్‌ సదుపాయం ఉంది. అన్ని చోట్లా ఉచిత పార్కింగ్‌ వసతి కల్పించాలని సిటీజన్లు కోరుతున్నారు.   
ఫీడర్‌ బస్సుల సంఖ్యను పెంచాలి: ప్రస్తుతం 30 కి.మీ. మెట్రో కారిడార్‌లో సమీప కాలనీలకు ఆర్టీసీ కేవలం 50 ఫీడర్‌ బస్సులను 10 రూట్లలో మాత్రమే నడుపుతోంది. ప్రతీ స్టేషన్‌ నుంచి 25 బస్సులు నిరంతరం సమీప కాలనీలు, బస్తీలకు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలి.  
రైళ్ల సంఖ్యను పెంచాల్సిందే: నాగోల్‌–అమీర్‌పేట్‌ (17కి.మీ), మియాపూర్‌–అమీర్‌పేట్‌ (13 కి.మీ) మార్గంలో ప్రస్తుతం 7 చొప్పున 14 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అధిక రద్దీ నేపథ్యంలో వీటి సంఖ్యను పదికి పెంచాలన్నది పబ్లిక్‌ డిమాండ్‌. ప్రస్తుతం రైళ్ల ఫ్రీక్వెన్సీ 10–15 నిమిషాలుగా ఉంది. దీన్ని 5 నిమిషాలకు తగ్గించాలి.
రద్దీ నియంత్రణ : శని,ఆదివారాల్లో మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్‌ను తలపిస్తున్నాయి. వేలాదిమంది పిల్లాపాపలతో స్టేషన్లకు తరలివస్తున్నారు. రద్దీ నియంత్రణకు పోలీసు శాఖ సహకారంతో తొక్కిసలాట జరగకుండా స్టేషన్లలోనికి, ప్లాట్‌ఫారం పైకి, బోగీల్లోకి వెళ్లే సమయంలో క్యూపద్ధతి, బార్‌కేడింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలి.  
స్మార్ట్‌కార్డు, మొబైల్‌యాప్‌: మెట్రో స్మార్ట్‌కార్డు ప్రస్తుతానికి మెట్రో జర్నీకే ఉపయుక్తం. దీని ద్వారా షాపింగ్, ఇంధన అవసరాలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ఇలా 16 రకాల సేవలు అందేలా చర్యలు తీసుకుంటే ప్రయాణికులకు మేలు జరుగుతుంది. ఈ కార్డు ద్వారా అందే ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన పెంచాలి. ఇక ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ‘టి–సవారీ’ యాప్‌ ఉపయోగాలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సివుంది.  
టోకెన్ల తకరారు: స్టేషన్లలో టిక్కెట్‌ విక్రయయంత్రాల వద్ద పాతనోట్లను యంత్రాలు తిరస్కరిస్తున్నాయి. టిక్కెట్‌కు సరిపడా చిల్లర లభించక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. వీటి వినియోగం పైనా జర్నీ చేసేవారికున్న అపోహలను మెట్రో అధికారులు తొలగించాల్సిన అవసరం ఉంది.  
మంచినీరు, టాయిలెట్స్‌: మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు దాహార్తిని తీర్చుకునే అవకాశం లేక విలవిల్లాడుతున్నారు. ప్రతీ స్టేషన్‌లో స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ఇక స్టేషన్లలో ఉన్న పే అండ్‌ యూజ్‌ టాయిలెట్లు.. అదీ అరకొరగానే ఉండడంతో ప్రయాణీకుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. తక్షణం స్టేషన్‌ రెండు చివరలా అత్యధికులు ఉపయోగించుకునేలా ఉచిత టాయిలెట్లు ఉండాలి.  
ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్‌ ఫర్నిచర్‌: ప్రతీ స్టేషన్‌ వద్ద తీరైన ఫుట్‌పాత్‌లు, బస్‌లు, ఆటో, క్యాబ్‌లు నిలిపేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్న అధికారుల మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. పలు స్టేషన్ల వద్ద ప్రధాన రహదారులు ఇరుకుగా ఉన్నాయి. ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్‌ ఫర్నిచర్‌ ఏర్పాటు, హరిత వాతావరణం ఏర్పాటు చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను తక్షణం పూర్తిచేయాలి.  
అమ్మో సైకిల్‌స్టేషన్లు: ప్రస్తుతానికి మియాపూర్‌ మెట్రోడిపోలనే ఈ సదుపాయం ఉంది. మరిన్ని స్టేషన్లకు ఈ సదుపాయం కల్పించాలని.. సైకిలింగ్‌ క్లబ్‌లో ప్రవేశించేందుకు సభ్యత్వ రుసుం సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.  
మెట్రో రూట్లలో తగ్గని ట్రాఫికర్‌: ప్రస్తుతం రెండు మార్గాల్లో మెట్రో జర్నీ చేస్తున్నవారి సంఖ్య లక్షకు మించడం లేదు. నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గాల్లో ట్రాఫికర్‌ అధికంగానే కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌ వసతి లేకపోవడం, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సమస్య కారణంగా మెజార్టీ సిటీజన్లు తమ వాహనాలనే నమ్ముకుంటున్నారు. దీంతో మెట్రో రూట్లలో ఉదయం,సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ టెర్రర్‌ అలాగే ఉంది.
హైటెక్‌సిటీ.. ఎల్బీనగర్‌ వరకు ఉండాలి: అమీర్‌పేట్‌ వరకున్న మెట్రో మార్గాన్ని ఇటు హైటెక్‌సిటీ.. అటు ఎల్బీనగర్‌ వరకు పొడిగిస్తేనే మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని మెజార్టీ సిటీజన్ల అభిప్రాయం ప్రధానంగా అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మార్గంలో పలు ఆస్తుల సేకరణ, స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్‌ మార్గాల డిజైన్లు మమార్చడం, సైబర్‌ టవర్స్, శిల్పారామం ప్రహరీల కూల్చివేతలు రీడిజైనింగ్‌ కారణంగా.. ఈ ప్రాంతాల్లో మెట్రో రూటు పనులు జఠిలంగా మారనున్నాయి. అమీర్‌పేట్‌– ఎల్బీనగర్‌ మార్గంలో లక్డీకాపూల్‌ వద్ద రైలు ఓవర్‌బ్రిడ్జీ నిర్మాణం, పుత్లీబౌలి వద్ద మెట్రో పనులు నత్తనడకన సాగుతుండడం ప్రతిబంధకంగా మారింది. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలి. ఈ రెండు మార్గాలు పూర్తయితేనే మెజార్టీ సిటీజన్లకు మెట్రో జర్నీ ఉపయుక్తంగా ఉంటుంది. 

ఎంఎంటీఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది....

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ముద్రపడిన మెట్రో రైలు.. ఎంఎంటీఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. గత 22 రోజులుగా మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నా ఎంఎంటీఎస్‌ సర్వీసులను వినియోగించుకుంటున్న ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజు 1.50 లక్షల మంది ఎంఎంటీఎస్‌ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. రెండు రైళ్లు రాకపోకలు సాగించే మార్గాలు వేరు కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌ అందుబాటులో ఉంది. హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడి నుంచి రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఐటీ కార్యాలయాలు ఉండడంతో ఎంఎంటీఎస్‌కు డిమాండ్‌ ఉంది. అటు లింగంపల్లి నుంచి, ఇటు నాంపల్లి నుంచి హైటెక్‌సిటీకి వెళ్లే వాళ్లకు కూడా ఎంఎంటీఎస్‌ మాత్రమే సౌకర్యంగా ఉంది. నాగోల్‌–అమీర్‌పేట్‌– మియాపూర్‌ మెట్రో మార్గానికి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్‌–హైటెక్‌సిటీ–లింగంపల్లి ఎంఎంటీఎస్‌ మార్గానికి ఎలాంటి సంబంధం లేదు. దీంతో ఎంఎంటీఎస్‌పై మెట్రో ప్రభావం చూపలేదు. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌కు, సికింద్రాబాద్‌ నుంచి హైటెక్‌సిటీ, లింగంపల్లికి ఎక్కువ మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. 

ఎంఎంటీఎస్‌ చౌకైన ప్రయాణం
మెట్రో చార్జీలతో పోలిస్తే ఎంఎంటీఎస్‌ టికెట్‌ ధరలు చాలా తక్కువ. కనిష్ట చార్జీ రూ.5 కాగా గరిష్ట చార్జీ రూ.10 మాత్రమే. మెట్రోలో కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.60 వరకు చార్జీ ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లు, సిటీ బస్సుల కంటే కూడా ఎంఎంటీఎస్‌ ప్రయాణం చాలా చౌకగా ఉంది. ప్రయాణికుల ఆదరణ ఏ మాత్రం తగ్గకపోవడానికి ఈ చౌక చార్జీలు కూడా కారణమయ్యాయి.  ఎంఎంటీఎస్‌లో రూ.10 టిక్కెట్‌పై ఏకంగా ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు పయనించవచ్చు. అదే  మెట్రోలో ఉప్పల్‌ నుంచి మియాపూర్‌ వెళ్లేలంటే రూ.60 ఖర్చవుతుంది. మరోవైపు కేవలం రూ.450  ఎంఎంటీఎస్‌ పాస్‌పైన నెలంతా పయనించవచ్చు. ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ప్రస్తుతం రూ.10 ఉంది, కానీ అంతే ధరతో ఎంఎంటీఎస్‌ టిక్కెట్‌పై 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే సదుపాయం లభించడం  గమనార్హం. అందుకే గ్రేటర్‌లో అన్ని వర్గాల ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌ ఒక లైఫ్‌లైన్‌గా మారింది. ఉదయం 4 నుంచి రాత్రి 11.30 వరకు కూడా ఈ రైళ్లు అందుబాటులో ఉండడం మరో సదుపాయం. 

రెండో దశతో మరో 2 లక్షల మందికి సేవలు
ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు పూర్తయితే మరో 2 లక్షల మందికి పైగా రవాణా సదుపాయం లభిస్తుంది. ముఖ్యంగా అటు పటాన్‌చెరు–తెల్లాపూర్‌ నుంచి ఇటు మేడ్చల్‌–బొల్లారం–సికింద్రాబాద్‌ వరకు, ఘట్‌కేసర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు, ఫలక్‌నుమా నుంచి ఉందానగర్‌ వరకు నగర శివార్లను కలుపుతూ  ఎంఎంటీఎస్‌ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. దీంతో ఇప్పటి వరకు కేవలం సిటీబస్సులు మాత్రమే ఉన్న ప్రాంతాలకు ఎంఎంటీఎస్‌ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు పనులకు నిధుల లేమి గండంగా మారింది. 2012లో ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఆరు మార్గాల్లో రూ.812 కోట్లతో అంచనాలను రూపొందించారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొత్తం రూ.1000 కోట్లు దాటినట్లు అంచనా. రాష్ట్ర ప్రభుత్వం మూడొంతుల నిధులను అందజేయాలి. మిగతా 1/4 వంతు రైల్వే అందజేస్తుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి రూ.150 కోట్ల వరకే అందాయి. అన్ని మార్గాల్లో సింగిల్‌ లైన్‌ డబ్లింగ్‌ చేశారు. కొన్ని చోట్ల విద్యుదీకరణ పూర్తయింది.

మొత్తం 60 శాతం పనులు పూర్తయ్యాయి.
కొత్త రైళ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. అల్వాల్, భూదేవినగర్, తదితర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు నిర్మించాలి. ఇంకా కొన్ని రూట్‌లలో విద్యుదీకరణ, డబ్లింగ్‌  పనులు పూర్తి చేయాలి. నిధుల కొరత కారణంగా ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఈ డిసెంబర్‌కు  బొల్లారం–సికింద్రాబాద్‌ మధ్య రెండో దశ రైళ్లు నడపాలని భావించారు. అలాగే ఘట్కేసర్‌–సికింద్రాబాద్, పటాన్‌చెరు–తెల్లాపూర్‌ లైన్‌లను కూడా వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ నిధుల లేమి కారణంగా పనులు స్తంభించాయి.

మెట్రో రెండో దశ పూర్తయితే..  
రెండో దశ ఎంఎంటీఎస్‌ పనుల పూర్తికి డిసెంబర్‌ గడువు ముగిసినప్పటికీ పనులు పూర్తి కాలేదు. దీంతో 2018లో పూర్తి చేయాలని తాజాగా నిర్ణయించారు. కానీ వచ్చే జూన్‌ నాటికి మెట్రో రెండో దశ హైటెక్‌సిటీ–రాయదుర్గం లైన్‌ పూర్తయితే ఎంఎంటీఎస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంది. ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు మెట్రో వైపు మళ్లొచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. నగర శివారును అనుసంధానం చేసే ఎంఎంటీఎస్‌ రెండో దశను సకాలంలో పూర్తి చేస్తే 2 లక్షల మందికి అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement