మూడు వైపుల నుంచి వరద | overflowing Krishna river increased drastically | Sakshi
Sakshi News home page

మూడు వైపుల నుంచి వరద

Published Sun, Aug 11 2019 2:57 AM | Last Updated on Sun, Aug 11 2019 10:39 AM

overflowing Krishna river increased drastically  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎగువన కుండపోత వర్షాలు, ఉప్పొంగుతున్న వాగులు, వంకలు, ఉపనదుల్లో పెరుగుతున్న వరద ఉధృతితో కృష్ణానది రోజురోజుకూ మహోగ్ర రూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో 15రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి ఏకంగా 6.30 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. జూరాల దిగువకు 2009 తర్వాత అంతటి స్థాయిలో శనివారం 6.10 లక్షల క్యూసెక్కులు (57.27 టీఎంసీ) ల మేర ప్రవాహం నమోదైంది. ఓ పక్క ఎగువ కృష్ణా నుంచి, మరోపక్క భీమా, ఇంకోపక్క తుంగభద్ర నుంచి వరద వస్తుండటంతో ఈ ప్రవాహాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు వరద పోటెత్తింది.  

మూడు నదుల ఉరకలు 
కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్‌ పర్వతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి భారీగా వరద వస్తోంది. ఈ రెండు జలాశయాల నుంచి శనివారం సాయంత్రం నీటి విడుదలను 6.25 లక్షల క్యూసెక్కులకు పెంచారు. కృష్ణానదికి ప్రధాన ఉపనది అయిన భీమాపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తి గా నిండింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగు వకు విడుదల చేస్తుండటంతో 95 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. ఇక జూరాల నుంచి 6.30 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలాన్ని చేరుతున్నాయి. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.49 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా నీటి నిల్వ 215 టీఎంసీలకు గానూ 205 టీఎంసీలకు చేరింది.

ఈ వరద ఉధృతి ఆదివారానికి 5.50 లక్షలకు చేరుతుందని అధికార వర్గాలు అంచనా . ప్రస్తుతం శ్రీశైలం నుంచి 10 గేట్ల ద్వారా 5.65 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.  మరోవైపు.. కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలోనూ వరద పెరుగుతోంది. తుంగభద్ర  ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 63,440 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  సుంకేసుల నుంచి తుంగభద్ర వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తారు. ఈ జలాలు కృష్ణా ప్రవాహంతో కలిసి శ్రీశైలాన్ని చేరనున్నాయి. మూడు వైపుల నుంచి  వరద చేరితే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చనుంది.  పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009–10లో గరిష్టంగా 1,218.55 టీఎంసీల జలాలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం జలాశయంలోకి 230 టీఎంసీలకుపైగా వచ్చాయి. వరద ప్రవాహ ఉధృతికి గతంలో ఎన్నడూలేని రీతిలో.. ఆగస్టు 9నే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం గమనార్హం.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement