
కేసీఆర్‌ను కలిసిన ఒవైసీ బ్రదర్స్
ప్రభుత్వంలో మజ్లిస్ భాగస్వామి కాదని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రిగా పదవిని చేపట్టబోతున్న కేసీఆర్‌కు అసదుద్దీన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌తో, అసద్ అరగంటపాటు సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావు, అక్బరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపామని చెప్పారు. అయితే ప్రభుత్వంలో భాగస్వాములు కాబోమని స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మతకలహాల నిరోధక చట్టాన్ని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నంలో చార్మినార్‌ను చేర్చాలని కోరామన్నారు. ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తించాలని ప్రతిపాదించామని చెప్పారు. అదేవిధంగా కృష్ణానది నీరును హైదరాబాద్ ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ను పాతబస్తీలో ఎర్పాటు చేయాలన్నామని తెలి పారు. అంతేకాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను రద్దుచేసి గతంలో మాదిరిగా 100 డివిజన్‌లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏ ర్పాటు చేయాల్సిందిగా కోరామన్నారు. మైనార్టీలకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కొనసాగింపు, సబ్‌ప్లాన్ ఏర్పాటు అంశాన్ని కూడా కోరామని ఆయన చెప్పారు.
కేసీఆర్‌ను కలిసిన ప్రముఖులు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. గురువారం కర్ణాటక లోకాయుక్త జస్టిస్ వై. భాస్కర్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం కన్వీన ర్ నిమ్మ నారాయణ. రాజ్యసభ మాజీ సభ్యుడు హరికృష్ణ, సినీ నటులు కైకాల సత్యనారాయణ, కల్యాణ్ రామ్‌తో పాటు పలువురు ప్రముఖులు కేసీఆర్‌ను కలిశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, కార్యదర్శులు బి. వెంకటేశం, పార్థసారధి, నాగిరెడ్డి తదితరులు కూడా ఆయనను కలిశారు.