సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ అధికారులను ఆర్టీఐ ద్వారా కోరింది. దీంతో అధికారులు నయీం కేసులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు వెల్లడించారు. అయితే ఈ సమాచారంపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలిపిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, పలు అంశాలతో గవర్నర్ నరసింహన్‌కు ఓ లేఖ రాసింది. దీనిపై పద్మనాభరెడ్డి గురువారం సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సందేహాలను వెలిబుచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ‘నయీం ఎన్‌కౌంటర్ జరిగి మూడేళ్లు గడిచిన తరువాత ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నయీంతో పోలీసులు, రాజకీయ నాయకులు సంబంధాలు పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారని సిట్ ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు నివేదికలో రూ. 3.74 లక్షలు సీజ్ చేసినట్టు చెప్తున్నారు. కానీ నాడు నయీం ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరికిందని కౌంటింగ్ మెషిన్‌లు తీసుకొచ్చి డబ్బులు లెక్కించారు. మరీ ఇంత తక్కువ మొత్తం లెక్కించడానికేనా కౌంటింగ్ మెషిన్‌లు తీసుకెళ్లింది?. రాజకీయ నాయకులకు ఎనిమిది మందికి ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టు చెప్పారు. మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?. నయీం ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక డైరీ దొరికిందని అన్నారు. మేము అందులో ఏముందో చెప్పాలని ఆర్టీఐ ద్వారా అడిగాం. కానీ దర్యాప్తు సమయంలో సమాచారం ఇవ్వలేమని చెప్పారు. డైరీలో ఉన్న సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. 2003 నుంచి నయీంపై 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వాటిని అతను చనిపోయాక రీ ఓపెన్ చేశారు. నయీం చనిపోయిన తరువాత 250 కేసులు నమోదైనట్టు చెబుతున్న పోలీసులు.. అతడు బతికి ఉన్నప్పుడు ఏం చేశారు?. ఇప్పటికే నయీం కేసులో తమకున్న అనుమానాలపై గవర్నర్‌కు లేఖ రాశామ’ని తెలిపారు.
చదవండి : నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు
Comments
Please login to add a commentAdd a comment