
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ‘పాన్’ తప్పనిసరి!
- విలువ రూ.10 లక్షలు దాటితే అమలు
- భారీగా జరిగే లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు పాన్ కార్డు తప్పనిసరి కానుంది. స్థిరాస్తుల విలువ రూ.10 లక్షలు దాటితే సదరు విక్రయ, కొనుగోలుదారుల పాన్ నంబర్లను దస్తావేజుల్లో పొందుపర్చనున్నారు. గతంలోనే ఈ విధానం అమల్లో ఉన్నా.. రిజిస్ట్రేషన్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. తాజాగా పాత నోట్ల రద్దు నేపథ్యంలో కచ్చితంగా అమలు చేయాలని ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ల సమావేశంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.10 లక్షలు దాటిన స్థిరాస్తుల క్రయ, విక్రయాలు, ఆస్తుల గిఫ్ట్ డీడ్లలో పాన్ కార్డు నంబర్‌ను తప్పనిసరిగా పొందుపర్చనున్నారు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే.. వారు ఫార్మ్-61లో వివరాలు పూర్తిచేసి దానిని దస్తావేజులతో జత చేయనున్నారు.
స్థిరాస్తుల లావాదేవీలపై దృష్టి..
స్థిరాస్తుల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది. స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై నిఘా పెడుతోంది. స్థిరాస్తుల క్రయ, విక్రయాలు, గిఫ్ట్ డీడ్లకు సంబంధించిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లలో పరిమితికి మించి ఆదాయం గల వారు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్లకు పాన్ కార్డును తప్పనిసరి చేయాలని స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ, ఆదాయ పన్ను శాఖలు నిర్ణరుుంచారుు.
విలువ రూ.10 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్ల వివరాలను సబ్ రిజిస్ట్రార్ల వారీగా ఆదాయపన్ను శాఖకు పంపేలా చర్యలు చేపట్టనున్నారు. వీటిని పరిశీలించి క్రయ, విక్రయదారులను ఆదాయ పన్ను పరిమితిలోకి తెచ్చే విషయంపై ఆ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకు రూ.30 లక్షలు దాటిన మార్కెట్ విలువకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల వివరాలను ఏడాదికోసారి ఆదాయ పన్ను శాఖకు పంపించే వారు. తాజాగా ప్రతి ఆరు నెలలకోసారి అందించేలా కొత్త నిబంధన పెట్టారు. అరుుతే తమ అవసరాల కోసమో లేదా అప్పు తీర్చేందుకో, పిల్లల పెళ్లిళ్ల కోసమో స్థిరాస్తులు అమ్మినా, కొనుగోలు చేసినా ఐటీ అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.