కరెంటోళ్లొస్తే నిర్బంధించండి | Panchayats to eliminate the electrical connections | Sakshi
Sakshi News home page

కరెంటోళ్లొస్తే నిర్బంధించండి

Published Sat, Aug 2 2014 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

కరెంటోళ్లొస్తే నిర్బంధించండి

కరెంటోళ్లొస్తే నిర్బంధించండి

కరీంనగర్ సిటీ : పంచాయతీల విద్యుత్ కనెక్షన్లు తొలగించడాని కి విద్యుత్ సిబ్బంది వస్తే గ్రామాల్లోనే నిర్బంధించాలని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ సర్పంచ్‌లకు సూచించారు. బకాయిలను ప్ర భుత్వమే భరించాల్సి ఉంటుందని, గ్రామ పంచాయతీల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ బిల్లులు చెల్లిం చొద్దని పేర్కొన్నారు. విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే భరించాలంటూ శుక్రవారం జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, డీఆర్‌వోకు సర్పంచ్‌ల సంఘం తరపున వినతిపత్రం అందించారు. అంతకుముందు నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. కేరళ తరహాలో పంచాయతీలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు సంబరపడుతున్న సర్పంచ్‌లకు విద్యుత్ బకాయిలు పంచాయతీలే చెల్లించాలన్న వార్త షాక్‌కు గురిచేసిందన్నారు.
 
 గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా ఆదేశించలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాలు చీకటిమయంగా మారాయన్నారు. బకాయిల పేరిట ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికే 800కు పైగా పంచాయతీలకు కనెక్షన్లు తొలగించారని ఆరోపించారు. 13వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నిధుల నుంచి 25 శాతం బకాయిలు చెల్లించాలనే డీపీవో సర్క్యులర్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
 
 సర్పంచ్‌ల జోలికొస్తే సహించేది లేదని, అవసరమైతే కలెక్టరేట్, సెక్రెటేరియేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామ జనా భా వారీగా తలసరి గ్రాంటు రూ.100కు పెంచాలని, పంచాయతీల తీర్మానాల మేరకే ఎమ్మెల్యే, ఎంపీలు అభివృద్ధికి నిధులు కేటాయించాలని, మరణించిన సర్పంచుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషి యో, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రతిసర్పంచ్‌కు ఉచిత సిమ్‌కార్డు ఇచ్చి, గ్రూప్ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. మేజర్ సర్పంచ్‌లకు రూ.20వేలు, మైనర్ సర్పంచ్‌లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు.
 
 సర్పం చ్‌లకు శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం కేటాయించిన 20 గుంటల స్థలంలో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించాలన్నారు. సమావేశంలో సర్పంచ్‌ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఉప్పుల అంజనీప్రసాద్, సుల్తానాబాద్, కరీంనగర్, గంగాధర మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్, బేతి సుధాకర్‌రెడ్డి, వైద రామానుజం, సర్పంచ్‌లు నందెల్లి పద్మ, శ్రీగిరి రంగారావు, టి.శ్రీనివాస్‌రావు, ఇందిర రాజేశం, అనితారెడ్డి, ఎన్నం కిషన్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement