జోగిపేటలో మల్లేష్.. పద్మ కార్మికులు. వీరి కూతురు ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. స్కూల్ ఫీజు ఏడాదికి రూ.17,500. మొదట సగం చెల్లించి.. మిగిలినది రెండు వాయిదాల్లో కట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫీజుతోపాటు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు, రవాణా ఖర్చులకు అదనంగా మరో రూ.6 వేలు ఖర్చు అవుతోంది. సంపాదనంతా చదువులకే పోతే ఏం తినాలి.. ఎలా బతకాలి అన్నదే వీరి బెంగ.. ఇలాంటి సమస్య ఈ ఒక్క దంపతులదే కాదు.. జూన్ నెల వచ్చిందంటే చాలు.. జిల్లాలో ఎవరి ఇంట చూసినా ఇలాంటి భయాలే నెలకొంటున్నాయి.
జోగిపేట, న్యూస్‌లైన్: జూన్ మాసం వచ్చేసింది.. గుబులు రేపుతోంది.. మరో వారం రోజుల్లో బడి గంటలు మోగనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయంటే ఇటు పిల్లలకు, అటు తల్లిదండ్రులకు దిగులే. వేసవి సెలవుల్లో ఎంతో ఎంజాయి చేసిన విద్యార్థులు బడి బాట పట్టాలంటే భారంగా భావిస్తుండగా.. కొండం త ఖర్చులను తలచుకుని తల్లిదండ్రులు ఆం దోళన చెందుతున్నారు. స్కూలు ఫీజులు యూని ఫారాలు, పుస్తకాలు, స్టేషనరీ, బస్సు చార్జీలు తదితర ఖర్చులు వారిని భయపెడుతున్నాయి. గతంలో విద్య తల్లిదండ్రులకు భారమయ్యేది కాదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలను చదివించేవారు.
రాను రాను పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతుండటం.. ఆంగ్లమాధ్యమ ప్రభావం పెరగడం వంటి కారణాలతో ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.. దీంతో తల్లిదండ్రులపై భారం పెరుగుతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ కరువవడంతో ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. సుమారుగా రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నాయి. మరోవైపు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, టై, బెల్ట్‌ల వ్యాపారమూ చేస్తూ తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.
అప్పు చేసి ‘చదివింపు’
విద్యా సంవత్సరం ప్రారంభమవుతండటంతో సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల కొనుగోలుకే వేతనం సరిపోదు. ఇక పిల్లల స్కూలు ఫీజు, యూనిఫారం, టై, బెల్టు, బ్యాగు స్టేషనరీ కొనుగోలుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫీజులు, పుస్తకాలు ఇతర వస్తువుల కొనుగోలుకు ఎంత లేదన్నా రూ. 17 వేలు అవసరం అవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
25 శాతం సీట్లు హుళక్కే?
నిరుపేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించి ఉచిత విద్యా బోధన అందించాలన్న నిబంధన అమలుకు నోచుకోవడంలేదు. దీనిని అమలుచేసేందుకు కూడా అధికారులు దృష్టి సారించడంలేదు. ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడా ఏ పేద విద్యార్థికి సీటు కేటాయించిన దాఖలాలు లేవని తెలుస్తోంది.
ఫీ‘జులుం’పై నియంత్రణ కరువు
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథులే లేరు. ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకునే అధికారం డిప్యూటీ ఈఓ, ఎంఈఓలకు ఉన్నా చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
అమ్మో.. జూన్
Published Wed, Jun 4 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement
Advertisement