పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఎదుట యువతి కుటుంబ సభ్యులు
పంజగుట్ట : ఇంజినీరింగ్ చదివిన తన కూతురును ప్రేమ పేరుతో ట్రాప్ చేసి అమ్మేయడానికి యత్నిస్తున్నారంటూ సదరు యువతి కుటుంబ సభ్యులు, పలు సంఘాల నాయకులు శనివారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన మహేష్ పెద్ద కుమార్తె ఇందిర (22) కరీంనగర్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసింది. కంప్యూటర్ కోర్సు చదువు కోసం ఏడాది క్రితం నగరానికి వచ్చింది. కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. ఈ క్రమంలో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత శనివారం తన సోదరికి ఇందిర ఫోన్ చేసి తాను మతం మారానని, అదే వర్గానికి చెందిన యువకుడిని వివాహం చేసుకున్నానని చెప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఆదివారం ఆమె ఉండే హాస్టల్‌కు వెళ్లి చూడగా ఇందిర జాడ కనిపించలేదు. దీంతో ఆమెకు ఫోన్ చేయగా.. తాను పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఉన్నానని చెప్పడంతో వారు అక్కడికి వెళ్లారు. వివాహం చేసుకున్న అబ్బాయిని, అతని కుటుంబ సభ్యులను పిలిపించండి మాట్లాడదామన్నారు. అతడికి ఎవరూ లేరని అన్నీ తనతోనే మాట్లాడండని, యువతి మేజర్ అని ఎస్సై దురుసుగా మాట్లాడా రని వారు ఆరోపించారు. ఎస్సై ఒక వర్గానికే మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాన్నను చూడాలంటూ తమ కూతురు ఫోన్‌లో మెసేజ్ పెట్టిందని వారు తెలిపారు. తొమ్మిది నెలల క్రితమే తమ కూతురు మతం మారినట్లు చూపిస్తున్నారని కానీ రెండు నెలల క్రితం తమతో తిరుపతికి వచ్చిందని, నెలరోజుల క్రితం సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా హాజరైందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఫేక్ సర్టిఫికెట్లు చూపించి తమ కూతురిని విదేశాల్లో విక్రయించేందుకు చూస్తున్నారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో వీరికి మద్దతుగా ఓ వర్గం ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిరసనవ్యక్తం చేశారు. ఒక వర్గానికే వత్తాసు పలుకుతున్న ఎస్సైపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఏసీపీ కార్యాలయం ఎదుట పలు సంఘాల నాయకుల నిరసన
ఆరోపణలు అవాస్తవం: ఏసీపీ తిరుపతన్న
లక్సెట్టిపేటకు చెందిన ఇందిర అలియాస్ జుబేరా టెక్ మహేంద్రాలో విధులు నిర్వహిస్తోందని, కరీంనగర్‌కు చెందిన రిజ్వాన్ గచ్చిబౌలిలో జెన్‌ప్యాక్‌లో విధులు నిర్వహిస్తున్నాడని పంజగుట్ట ఎసీపీ తిరుపతన్న తెలిపారు. తమ వివాహం పెద్దలకు ఇష్టం లేదంటూ, రక్షణ కల్పించాలంటూ గత నెల 26న పంజగుట్ట పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. ఒక వర్గానికి ఎస్సై మద్దతు పలుకుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇందిర, రిజ్వాన్ కరీంనగర్‌లో ఇంజినీరింగ్ చదువుకున్నారని, అప్పుడే వారికి పరిచయం ఉందన్నారు. 2018 జులైలోనే వీరు వివాహం చేసుకున్నారని, అప్పటికే అమ్మాయి మతం మారిందని తిరుపతన్న చెప్పారు. అనుమానాలున్నట్లు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని ఆయన స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment