మాట్లాడుతున్న స్వామి పరిపూర్ణానంద
సాక్షి, కాగజ్‌నగర్ : సిర్పూర్ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందని, నిలదీస్తే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉదయం శిశుమందిర్ పాఠశాల ఆవరణ గ్రౌండ్‌లో హెలిక్యాప్టర్‌లో దిగిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాజీవ్‌గాంధీ చౌక్‌కు చేరుకొని క్రీడామైదానానికి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ 2014లో సిర్పూర్ నియోజకవర్గానికి దరిద్రం పట్టుకుందని, దాని నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఆరాచక పాలన కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పత్రికలు నిజాలు రాసే స్వేచ్ఛ కూడా లేదని విమర్శించారు. ఇక నుంచి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కాషాయం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఓటుకు రూ.5వేలతో కొనుక్కుంటామని ధీమాతో ఉన్నారని, డబ్బులు తీసుకొని విద్యావంతుడు, వైద్యుడు అయిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇప్పటికీ కుటుంబ పాలన కొనసాగుతుందని, టీఆర్‌ఎస్, మహాకూటమి కాంగ్రెస్‌ను ఓడించాలని కోరారు.
బీజేపీని గెలిపిస్తే సిర్పూర్‌కు సిరి వస్తుందన్నారు. గంతంలో గుంతలు తవ్వి ప్రజా ధనాన్ని కాంగ్రెస్ దోచుకుంటే, ప్రస్తుతం ప్రాజెక్టును తుమ్డిహెట్టి నుంచి కమిషన్ల కోసం కాళేశ్వరానికి తరలించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, జిల్లాలోని బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అమూల్యమైన ఓటువేసి గెలిపిస్తే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు, ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు, ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం అభ్యర్థి ఆత్మరాం మాట్లాడుతూ మన సాంప్రదాయాలు కాపాడుకుంటూ ఇతరుల సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సతీష్, మురళి, అంజనేయులు, కొంగ సత్యనారాయణ, విశాల్, శరత్‌శర్మ, తిరుపతి, జిలకర పోచం, నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment