నాంపల్లిలోనూ..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రో పార్కింగ్ కష్టాలు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నాంపల్లి, అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్‌మెట్రో స్టేషన్లకు అవసరమైన పార్కింగ్ స్థలాలు ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సేకరించింది. సోమవారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎవర్ కార్స్ సంస్థ అధీనంలో ఉన్న 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పార్కింగ్ స్థలాన్ని మెట్రో అధికారులు సేకరించారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు తమ వ్యక్తిగత వాహనాలను ఈ స్థలంలో నిలుపుకొనేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ అధికారులు మెట్రోకు ఈ స్థలాన్ని కేటాయించారు. దీనిని తమకు రూ.15 కోట్లకు విక్రయించాలంటూ.. ఖాళీ చేసేందుకు ఎవర్‌కార్స్ సంస్థమొండికేసింది. దీంతో రంగంలోకి దిగిన మెట్రో అధికారులు ఆ సంస్థకు సంబంధించిన వస్తువులను పోలీసుల సహకారంతో సోమవారం బలవంతంగా తొలగించారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అన్ని వసతులతో పార్కింగ్ స్థలం ఏర్పాటుచేస్తా మని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపా రు. మెట్రో స్టేషన్‌లకు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన పార్కింగ్ స్థలాల సేకరణ జటిలంగా మారినప్పటికీ ప్రభుత్వ సహకారంతో ఒక్కో సమస్యను అధిగమిస్తున్నామన్నారు.
నాంపల్లిలోనూ..
ఇక నాంపల్లి మెట్రో స్టేషన్.. రైల్వే స్టేషన్ మధ్యలోని 2,800 చదరపు అడుగుల ప్రభుత్వ స్థలాన్ని సైతం మెట్రో పార్కింగ్‌కు కేటాయించారు. సుమారు రూ.28 కోట్ల విలువైన ఈ స్థలాన్ని ప్రైవేటు ట్యాక్సీ అసోసియేషన్లు ఆక్రమించాయి. ఇటీవలే ఆక్రమణలను తొలగించి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మెట్రో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు బస్‌బేతో పాటు ఆధునిక సౌకర్యాలతో వెహికిల్ బే, అత్యాధునిక మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
మెట్రో విద్యుదీకరణ పనులు భేష్
సాక్షి, సిటీబ్యూరో: నగరమెట్రో ప్రాజెక్టులో భాగంగా మలక్‌పేట్ నుంచి మూసారాంబాగ్ రూట్లో మెట్రో కారిడార్ల విద్యుదీకరణ పనులను కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ఈసీఐజీ) డీవీఎస్‌రాజు సోమవారం తనిఖీ చేశారు. ఈ మార్గంలో 33,415 కెవి ఇండోర్ సబ్‌స్టేషన్లను తనిఖీచేసి పనుల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ మార్గంలో స్టేషన్లు,ట్రాక్ విద్యుదీకరణ పనులతోపాటు సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, ఆటోమేటిక్ టికెట్ కలెక్టింగ్ యంత్రాల వ్యవస్థను పరిశీలించారు. కాగా ఈ సబ్‌స్టేషన్లకు ఎంజీబీఎస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ సబ్‌స్టేషన్ల పూర్తితో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతోందని డీవీఎస్ రాజు తెలిపారు. ఆయన వెంట మెట్రో ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.పి.నాయుడు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment