జాతీయ ఉద్యమాల్లో పాల్గొనాలి
సుల్తాన్‌బజార్ : ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా దేశ అభివృద్ధికి దోహద పడాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యర్శి పి. మురళీధర్‌రావు అన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో శనివారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ‘తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద రాజకీయాలు- ప్రాస్పెక్ట్స్ ఛాలెంజెస్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్‌ను రక్షించుకునేందుకు తెలుగు సైనికులు తమ జీవితాలను అర్పిస్తున్నారన్నారు. సరైన నాయకత్వం లేని దేశం అవకాశాలను అందిపుచ్చుకోలేదని, ప్రపంచంలోని పోటీని తట్టుకోలేక అవకాశాలు, అర్హతలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలకు దేశస్థాయి ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడే దేశ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు.
కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ నాయకత్వం, ఉనికి కోసం మరో రాష్ర్టంపై అరోపణలు చేయడం దారుణమన్నారు. కొన్ని లోపాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందన్నారు. ఉద్యమాలకు దూరమై, కేవలం ఎన్నికల గురించే మాట్లాడినందునే కాంగ్రెస్ నష్టపోయిందన్నారు. బీజేపీకి వర్గ, కుల రహితమైన భవిష్యత్తుతో కూడిన ఏజెండా ఉందన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌పార్టీని పునర్మించలేరని ఆయన పేర్కొన్నారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణంతో ప్రపంచమంత విచారంగా ఉంటే మతతత్వ రాజకీయ నాయకులు యాకుబ్ మెమనే కనిపించారని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్ మత రాజకీయాలకు కాకుండా దేశ రాజకీయాలకు దగ్గరగా ఉండాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజ్ఞ భారతీ అధ్యక్షులు డాక్టర్ ఎల్. రాజభాస్కర్‌రెడ్డి, ఏపీ, తెలంగాణ ఛైర్మన్ టి. హనుమాన్‌చౌదరితో పాటు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు.