
సాక్షి, హైదరాబాద్: చెరువులను కాలుష్యం బారి నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన చట్ట నిబంధనలను ఉల్లంఘించినా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. చెరువులకు పూర్వవైభవం తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా, సంస్థలు ఎంత పెద్దవైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పోలీసులు, రెవెన్యూ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని డీజీపీ, ఆయా పోలీస్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లకు హైకోర్టు స్పష్టం చేసింది.
కాలుష్యం నుంచి చెరువులకు విముక్తి కల్పించి, వాటిని పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు చర్యలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి తీసుకుంటున్న చర్యలపై మరిన్ని వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అంజనాసిన్హా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment